Tirumala : తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం అయినా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం అయినా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. శ్రీవారి సాలికట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతుండటంతో పాటు తమిళనాడులో పెరటాసి మాసం అవ్వడంతో అత్యధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారిని దర్శించుకోవడంతో పాటు వాహన సేవల్లో పాల్గొంటే శుభప్రదమని నమ్ముతూ అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు. దీనికి తోడు దసరా పండగ సెలవులుకూడా ఉండటంతో తిరుమలకు భక్తుల రద్దీ పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
బ్రహ్మోత్సవాలు రేపటితో ముగియనుండటంతో...
నేడు తిరుమలలోని శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. రేపు చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈరోజు ఉదయం మాడవీధుల్లో రథోత్సవం జరుగుతుంది. రాత్రి ఏడు గంటలకు అశ్వవాహనంపై భక్తులకు మలయప్ప స్వామి దర్శనమివ్వనున్నారు. రేపటితో బ్రహ్మోత్సవాలు ముగియనుండటంతో తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. భక్తులకు అవసరమైన అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
పథ్నాలుగు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని పథ్నాలుగు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 73,275 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 21,973 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.77 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.