Tirumala : తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ .. క్యూ లైన్లలోనే భక్తులు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారమయినా దసరా సెలవులు కావడంతో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారమయినా దసరా సెలవులు కావడంతో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. కంపార్ట్ మెంట్లన్నీ నిండి పోయాయి. గంటల సమయం శ్రీవారి దర్శనం కోసం నిరీక్షించాల్సి వస్తుంది. గత కొద్ది రోజులుగా తిరుమలకు భక్తుల రద్దీ తగ్గడం లేదు. బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతుండటంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు వచ్చి శ్రీవారికి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. తమిళనాడు నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తుల తరలి వస్తున్నారు.
నేడు చంద్రప్రభ వాహనంపై...
తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏడోరోజుకు చేరుకున్నాయి. ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు సూర్యప్రభ వాహనం లో మాడవీధుల్లో మలయప్ప స్వామి భక్తులకు కనిపించారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు స్నపన తిరుమంజనం జరుగుతుంది. రాత్రి 7గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. భక్తుల ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలను అధికారులు తీసుకుంటున్నారు.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ముప్ఫయి ఒక్క కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఏడు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు గంటలకు పైగానే పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 81,626 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,304 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో హుండీ ఆదాయం రూ.4.14 కోట్లు సమకూరింది.