Tirumala : తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ.. దర్శనానికి వేచి ఉండే సమయం ఎంతంటే?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం అయినా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.

Update: 2025-09-29 03:55 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం అయినా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. నిన్న శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా గరుడ వాహన సేవను తిలకించేందుకు రెండు లక్షల మంది వరకూ భక్తులు తిరుమలకు తరలి వచ్చారు. వారంతా నేడు దర్శనానికి బారులు తీరారు. దీంతో తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతుంది. తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో వారు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.

బ్రహ్మోత్సవాల సమయంలో...
తిరుమలకు బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. బ్రహ్మోత్సవాలకు ముందుగా అందుకు అవసరమైన ఏర్పాట్లను చేసింది. క్యూ లైన్ లలో వేచి ఉన్న భక్తులకు అవసరమైన అన్న ప్రసాదాలను, మజ్జిగ, పాలు, మంచినీటిని సరఫరా చేస్తుంది. బ్రహ్మోత్సవాలు వచ్చే నెల రెండో తేదీ వరకూ జరగనుండటంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని భావించిన అధికారులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. దసరా సెలవులు కూడా ఉండటంతో పాటు తమిళనాడులో పెరటాసి మాసం ఉండటంతో భక్తులు అధికంగా వస్తారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.
అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయి...
ఈరో్జు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకూ క్యూ లైన్ విస్తరించింది. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఎనిమిది గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 79,496 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 29,591 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.79 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.


Tq













Tags:    

Similar News