Tirumala :తిరుమలలో నేడు కూడా భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం అయినా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గలేదు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం అయినా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. రాను రాను ఇంకా భక్తుల రద్దీ పెరుగుతుందని అధికారులు అంచనా వేసి ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నారు. తిరుమలకు భక్తులు అధికంగా తరలి వస్తుండటంతో కొండపైన వసతిగృహాలు దొరకడం కూడా కొంత ఆలస్యమవుతుంది. స్వామి వారి దర్శనం పూర్తయితే వెంటనే వసతి గృహాలను ఖాళీ చేసి వెళ్లాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కోరుతున్నారు. మిగిలిన భక్తులకు సౌకర్యంగా ఉండాలంటే సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
నేడు సర్వదర్శనం మధ్యాహ్నం నుంచి...
నేడు తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజసం జరగనుంది. సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజసం సందర్భంగా అష్టదళపాదపద్మారాధన సేవలను రద్దు చేశారు. మధ్యాహ్నం నుంచి సర్వదర్శనం ప్రారంభం కానుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నేడు మరొకవైపు టీటీడీ పాలక వర్గం సమావేశం కానుంది. ఈ నెలలో ప్రారంభం కానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలపై చర్చించనుంది. భక్తుల రద్దీకి అవసరమైన చర్యలను ఈ సమావేశంలో తీసుకోనుంది.
ముప్ఫయి ఒక్క కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ముప్ఫయి ఒక్క కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో ఉదయం టోకెన్లు లేకుండా వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు నుంచి పదిహేను గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 65,066 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,620 మంది తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.13 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.