Tirumala : తిరుమలకు వెళ్లే వారికి అలెర్ట్.. కొన్ని రోజులు ఆగితే మంచిది
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వరస సెలవులు రావడంతో పాటు ఆదివారం కూడా కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వరస సెలవులు రావడంతో పాటు ఆదివారం కూడా కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. నిన్ననే తిరుమలకు పోటెత్తిన భక్తులను చూసి క్యూ లైన్లు కిలోమీటర్ల వరకూ విస్తరించిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సర్వ దర్శనానికి నలభై ఎనిమిది గంటల సమయం పడుతుందని టీటీడీ మైకుల్లో ప్రకటించింది. నిన్న మొదలయిన భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగే అవకాశమున్నందున అధికారులు అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
అలిపిరి టోల్ గేట్ నుంచి...
అలిపిరి టోల్ గేట్ నుంచి మనకు తిరుమల రద్దీ ఎంత ఉందో ఇట్టే తెలిసి పోతుంది. వందల సంఖ్యలో వాహనాలు చెకింగ్ కోసం ఎక్కువ సేపు నిరీక్షించాల్సి ఉండటంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తారని అంచనా వేస్తారు. ఘాట్ రోడ్డు లో ప్రయాణం కూడా రద్దీగా మారనుంది. ఎక్కువ మంది సొంత వాహనాలతో బయలుదేరి వస్తుండటంతో తిరుమలకు చేరుకోవాలంటే ఘాట్ రోడ్డులో ప్రయాణం ప్రమాదకరంగా మారనుందని అధికారులు తెలిపారు. అయితే రోజుకు ఎనభై వేలకు మందికి పైగానే భక్తులు శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
శిలాతోరణం వరకూ...
ఈరోజు కూడా తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలా తోరణం వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించి ఉంది. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవైగంటలకు పైగానే సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్ కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 87,759 మంది భక్తులు దర్శించుకున్నారు.నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.16 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.