Tirumala : తిరుమలలో భక్తుల క్యూ లైన్ ఎంత పొడవంటే.. క్యూ లైన్ లోకి వెళ్లిన వారు?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఈరోజు శనివారం కావడంతో శ్రీకృష్ణాష్టమి కూడా తోడవ్వడంతో భక్తులు పోటెత్తారు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఈరోజు శనివారం కావడంతో శ్రీకృష్ణాష్టమి కూడా తోడవ్వడంతో భక్తులు పోటెత్తారు. అలిపిరి టోల్ గేట్ నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. ఘాట్ రోడ్డులో ప్రయాణం కూడా ప్రమాదకరంగా మారింది. అందుకే భక్తులు తక్కువ స్పీడ్ తో సొంత వాహనాల్లో తిరుమల కొండకు బయలుదేరి రావాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కోరుతున్నారు. శనివారం కావడంతో వసతి గృహాలు దొరకడం కూడా కష్టంగా మారిందని భక్తులు వాపోతున్నారు.
భారీ వర్షాలు కురుస్తున్నా...
ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ తిరుమలకు భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. సహజంగా ఆగస్టు నెలకు వచ్చే సరికి భక్తుల రద్దీ సాధారణంగానే ఉంటుందని, అయితే ఈసారి అందుకు భిన్నంగా పాఠశాలల తిరిగి ప్రారభమయిన తర్వాత జూన్, జులై, ఆగస్టునెలల్లో కూడా రద్దీ ఏమాత్రం తగ్గలేదని టీటీడీ అధికారులు చెబుతున్నారు. అయితే ముందుగా బుక్ చేసుకున్న భక్తులతో పాటు అప్పటి కప్పుడు వచ్చిన భక్తులు ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
గోగర్భం డ్యామ్ వరకూ...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. గోగర్భం డ్యామ్ వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. కిలోమీటర్ల కొద్దీ భక్తులు శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్ లో వేచి చూస్తుున్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఏడు గంటలకుపైగానే సమయం పడుతుంది. మూడు వందల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 77,043 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 41,859 మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.53 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.