Tirumala : తిరుమలకు ఈరోజు వెళుతున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఒక్కసారిగా ఎక్కువయింది.

Update: 2025-07-19 03:12 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఒక్కసారిగా ఎక్కువయింది. అలిపిరి టోల్ గేట్ నుంచి భక్తుల రద్దీ మొదలయింది.అలిపిరి టోల్ గేట్ వద్ద గంటల నుంచి వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. గంటల కొద్దీ వాహనాల తనిఖీ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. తిరుమలకు శనివారం నాడు వచ్చి ఏడుకొండల వాడిని దర్శించుకుంటే అన్ని పాపాలు పోతాయని, పుణ్యం వస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే శనివారం తిరుమల వెంకటేశుడిని దర్శించుకోవడానికి ఎక్కువ మొగ్గు చూపుతారు.

సామాన్య భక్తులు ఇబ్బందులు పడకుండా...
మామూలుగా కూడా గత రెండున్నర నెల నుంచి భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు. మే 15వ తేదీ నుంచి తిరుమలకు భక్తుల పోటెత్తుతుండటంతో అందుకు తగినట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సామాన్య భక్తులు ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాలను, మజ్జిగ, మంచినీటిని పంపిణీ చేస్తున్నారు. క్యూ లైన్ పెరగడంతో దర్శనానికి పెద్ద సమయం పట్టకుండా టీటీడీ అధికారులు చర్యలు తీసుకున్నారు.
కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. బయట శిలాతోరణం వరకూ క్యూ లైన్ విస్తరించింది. అంటే బయటకు రెండు కిలోమీటర్ల వరకూ క్యూలైన్ విస్తరించింది. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటలకు సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం ఐదు గంటలకు పైగానే సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 73,093 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారికి 31,570 మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.21 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News