Tirumala : తిరుమలలో ఇంత రద్దీ ఎప్పుడూ లేదే...ఇంత పొడవు క్యూ లైనా?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది.

Update: 2025-07-11 03:02 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. గత కొన్నాళ్లుగా తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడం లేదు. దాదాపు రెండున్నర నెలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు. ఆషాఢమాసం కావడంతో శుభముహూర్తాలు, పండగలు లేకపోవడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి భక్తులు తమ మొక్కులు శ్రీ వెంకటేశ్వరస్వామి వద్ద చెల్లించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని తిరుమల తిరుపతి దేవస్థఆనం అధికారులు తెలిపారు.

రెండున్నర నెలల నుంచి...
అందుకే మే 15వ తేదీ నుంచి ప్రారంభైన భక్తుల రద్దీ నేటి వరకూ కొనసాగుతూనే ఉంది. సహజంగా శుక్ర, శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఒకరోజు సెలవు పెట్టుకుంటే వరసగా మూడు రోజుల పాటు సెలవులు వస్తాయని, స్వామి వారి దర్శనంతో పాటు ఇతర పుణ్యక్షేత్రాలను కూడా దర్శించుకోవచ్చని నమ్ముతారు. మరొకవైపు ఉత్తరాంధ్ర నుంచి తమిళనాడులోని పుణ్య క్షేత్రాలకు వెళ్లే భక్తులు కూడా తిరుమలకు వస్తున్నారని, వారు రోజువారీ ఎస్.ఎస్.డి టోకెన్లు తీసుకుని దర్శనం కోసం క్యూ లైన్ లో నిల్చుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
అన్ని కంపార్ట్ మెంట్లు నిండి...
ఈరోజు తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. బయట శిలాతోరణం వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించిందని అధికారులు తెలిపారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఏడు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 63,473 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 27,796 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయ 4.54 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News