Tirumala : తిరుమల రద్దీ ఏందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలిపిరి టోల్ గేట్ వద్దనే తెలుస్తుంది?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంది. గత ఇరవై రోజులకు పైగానే భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. సహజంగా తిరుమలకు శుక్ర, శని, ఆదివారాలు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో వేసవి సెలవులు పూర్తి కావస్తుండటంతో పాటు పెళ్లిళ్ల సీజన్ కూడా నడుస్తుండటంతో ఒక్కసారిగా భక్తుల సంఖ్య పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. అయితే సామాన్య భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.
భక్తులు ఇబ్బందులు పడకుండా...
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు కూడా తరలి వస్తుండటంతో పాటు సర్వదర్శనం తో పాటు మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారు, కాలినడకన వచ్చే భక్తులు, టైమ్ స్లాట్ దర్శనం భక్తులు, రోజు వారీ ఎస్ఎస్డీ టోకెన్లు తీసుకున్న భక్తులు కూడా తరలి వస్తుండటంతో తిరుమల గిరులు గోవింద నామస్మరణలతో మారుమోగిపోతున్నాయి.అలిపిరి వాహనాల తనిఖీ కేంద్రం నుంచి రద్దీ ఎలా ఉందో తెలిసిపోతుంది. అయితే క్యూ లైన్లలో భక్తులు ఇబ్బంది పడకుండా మొత్తం క్యూ లైన్లకు సమీపంలో పన్నెండు చోట్ల అన్నప్రసాద కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
అన్ని కంపార్ట్ మెంట్లు నిండి...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట ఏటీజీహెచ్ వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉదయ ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పదిహేను గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 67,284 భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31,268 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.34 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.