Tirumala : తిరుమల వెళ్లే భక్తులకు తీపికబురు.. సులువుగా దర్శనం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం కావడంతో రద్దీ అంతగా లేదు
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం కావడంతో రద్దీ అంతగా లేదు. భక్తులు స్వామివారిని సులువుగానే దర్శనం చేసుకుంటున్నారు. పెద్దగా కంపార్ట్ మెంట్లలో వేచి ఉండకుండానే ఏడుకొండల వాడిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆపద మొక్కుల వాడి చెంతకు ఇటీవల కాలంలో పెద్దయెత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఈ సమయంలో భక్తులు ఇబ్బందులు పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. వారికి వసతి, అన్న ప్రసాదం వంటి విషయాల్లో ఏ లోటు రాకుండా చూసుకుంటున్నారు.
వరసగా రద్దీ ఉండటంతో...
గత కొన్ని నెలలుగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వరసగా సెలవులు, పండగలు రావడంతో పాటు బ్రహ్మోత్సవాలు ఇలా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం కూడా భారీగా పెరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో కార్తీక మాసంలోనూ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. తీర్థయాత్రలకు, దేవాలయాల సందర్శనకు ఇదే సరైన సమయం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు వస్తారని భావించి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ఈరోజు మాత్రం భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని పది కంపార్ట్ మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 72,283 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 22,583 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.54 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.