ఆ కారణంతోనే నారా భువనేశ్వరికి చంద్రబాబును కలిసే అవకాశం దక్కలేదు

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు

Update: 2023-09-15 16:17 GMT

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు ఆయన భార్య భువనేశ్వరికి శుక్రవారం నాడు ములాఖత్ నిరాకరించారు. దీనిపై జైళ్ల శాఖ స్పందించింది. ఈ మేరకు జైళ్ల ఉపశాఖాధికారి ఓ ప్రకటనను విడుదల చేశారు. భువనేశ్వరి ములాఖత్ కోసం దరఖాస్తు చేసుకున్నారని, కానీ రిమాండ్ ముద్దాయికి ఓ వారంలో రెండు ములాఖత్‌లు మాత్రమే ఉంటాయని అధికారులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే జైలు సూపరిండెంటెండ్ అనుమతిస్తే మూడో ములాఖత్‌కు అనుమతి ఉంటుందన్నారు. భువనేశ్వరి అత్యవసర కారణాలను దరఖాస్తులో ప్రస్తావించలేదని, దీంతో మూడో ములాఖత్‌ను తిరస్కరించామని అధికారులు తెలిపారు.

వారానికి మూడుసార్లు ములాఖత్‍కు అవకాశం ఉన్నా తిరస్కరించారని టీడీపీ నాయకులు ఆరోపించారు. చంద్రబాబు అరెస్టు తర్వాత రాజమండ్రిలోనే ఉంటున్న నారా భువనేశ్వరి 12వ తేదీన బాబుతో భేటీ అయ్యారు. గురువారం మరో మారు ఆమె చంద్రబాబును కలిసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఆమె దరఖాస్తును జైళ్ల శాఖ అధికారులు తిరస్కరించారు. ములాఖత్‍పై సైతం ప్రభుత్వం అవమానీయంగా వ్యవహరిస్తోందని భువనేశ్వరి ఆరోపించారు. నిబంధనల ప్రకారం ములాఖత్ ఇచ్చేందుకు అవకాశం ఉన్నా కాదనడంపై భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.
రిమాండ్ ఖైదీలకు వారానికి రెండు ములాఖత్‌లకు మాత్రమే అనుమతిస్తారని జైళ్ల శాఖ డీఐజీ స్పష్టం చేశారు. ఒక ములాఖత్‌లో ముగ్గురిని మాత్రమే రిమాండ్‌ ఖైదీతో భేటీ అయ్యేందుకు అనుమతిస్తారని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడును ఈ నెల 11వ తేదీన ఖైదీగా అడ్మిట్ చేసుకున్నారని, 12వ తేదీన నారా లోకేష్‌, భువనేశ్వరి, నారా బ్రహ్మణి ఆయనతో భేటీ అయ్యారని జైళ్ల శాఖ అధికారులు వివరించారు. 14వ తేదీన పవన్ కళ్యాణ్‌, బాలకృష్ణ, లోకేష్ భేటీ అయ్యారని వారంలో రెండు ములాఖత్‌లు పూర్తయ్యాయని డిఐజి వివరణ ఇచ్చారు. అత్యవసర కారణాలతో ఎవరైనా సందర్శకులు రిమాండు ఖైదీలతో మాట్లాడటానికి లిఖితపూర్వకంగా అనుమతి కోరితే ఆ కారణాలను పరిశీలించుకుని, జైలు సూపరింటెండెంట్ విచక్షణాధికారాల ఆదారంగా మూడో ములాఖత్ మంజూరు చేస్తారని తెలిపారు.


Tags:    

Similar News