Rain Alert : నైరుతి పోయింది.. ఈశాన్యం వచ్చింది... వానలు మామూలే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు దేశం నుంచి పూర్తిగా నిష్క్రమించాయి. అదే సమయంలో దక్షిణాదిలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. వీటి ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కోస్తాంధ్ర, రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక, కేరళ వాతావరణ సబ్ డివిజన్ లలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించినట్లు ఐఎండీ ప్రకటించింది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో లక్షద్వీప్ పరిసరాల్లో ఈరోజు అల్పపీడనం ఏర్పడుతుందని, 48 గంటల్లో అది వాయుగుండంగా బలపడే అవకాశముందని ఐఎండీ పేర్కొంది.
ఏపీలో ఈ జిల్లాల్లో...
ఆంధ్రప్రదేశ్ లో మరికొన్ని రోజుల పాటు వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముందని, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అన్నమయ్య, కడప, శ్రీసత్యసాయి, అనంతపురం, ప్రకాశం, కృష్ణా, గుంటూరు, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు కురిసే అవకాశముందని, పిడుగులు పడే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
తెలంగాణలో...
తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అనేక జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. కొన్ని ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో వర్షాలు అక్కడకక్కడా పడతాయని చెప్పింది. ఈరోజు జోగులాంబ గద్వాల్, నారాయణపేట్, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని, కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముందని వార్నింగ్ ఇచ్చింది.