Bheemvaram Politics : రఘురామ క్లీన్ చిట్ ఇవ్వడం వెనక ఇంతుందా?

భీమవరం డీఎస్సీ జయసూర్య వ్యవహారం కూటమి పార్టీలో మరొకసారి రాజకీయ విభేదాలు తలెత్తినట్లు కనిపిస్తుంది

Update: 2025-10-23 07:09 GMT

భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారం కూటమి పార్టీలో మరొకసారి రాజకీయ విభేదాలు తలెత్తినట్లు కనిపిస్తుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ డీఎస్సీపై విచారణ చేసి నివేదికను సమర్పించాలని ఎస్సీని కోరడంతో పాటు చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయంపై సీరియస్ అయ్యారు. భీమవరం ప్రాంతంలో జూదాలు, మట్కా వంటివి డీఎస్పీ ప్రోత్సహిస్తున్నారని పవన్ కల్యాణ్ కు అక్కడి ప్రజలు ఫిర్యాదు చేయడంతో ఆయన నేరుగా జోక్యం చేసుకోకుండా హోంమంత్రి కార్యాలయానికి నివేదిక పంపాలని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జూదం పెరగడంపై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా సివిల్ వివాదాల్లో కూడా డీఎస్పీ జయసూర్య తలదూరుస్తున్నారని పవన్ కార్యాలయానికి ఫిర్యాదులు అందడంతో ఆయన చర్యలు తీసుకోవాలని కోరారు.

రఘురామ కితాబివ్వడం వెనక..?
అయితే డిప్యూటీ స్పీకర్, ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు మాత్రం అదే డీఎస్పీకి క్లీన్ చిట్ ఇవ్వడం ఇప్పుడు కూటమి పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. డీఎస్పీ జయసూర్యకు మంచి ట్రాక్ రికార్డు ఉందని రఘురామ కృష్ణరాజు కితాబిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాల్లో జూదంపై పోలీసులు పట్టిష్టమైన నిఘా పెట్టారని అన్నారు. అందుకే డీఎస్పీపై ఆరోపణలు కొందరు పనిగట్టుకుని చేస్తున్నారని రఘురామ కృష్ణరాజు అభిప్రాయపడ్డారు. తన నియోజకవర్గమైన ఉండిలో ఎలాంటి జూదం జరగడం లేదని, పేకాట శిబిరాలు నడవడం లేదని స్పష్టం చేశారు. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ డీఎస్పీపై నివేదిక కోరితే డిప్యూటీ స్పీకర్ మాత్రం క్లిన్ చిట్ ఇవ్వడం హాట్ హాట్ గా మారింది.
సమాచారం ఇచ్చిందెవరు?
నిజానికి గోదావరి జిల్లాల్లో పేకాట అనేది సాధారణమని, కోడిపందేలు ఎలాగో పేకాట కూడా అలాగే ఆడుకుంటారని, అది జూదం కాదని కొందరు టీడీపీ నేతలు అంటున్నారు. కానీ డీఎస్పీ జయసూర్య మాత్రం జూదగృహాలను ప్రోత్సహిస్తున్నారని పవన్ కల్యాణ్ కు సమాచారం ఇచ్చిందెవరన్న దానిపై టీడీపీ నాయకత్వం ఆరా తీస్తున్నట్లు తెలిసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. భీమవరం ఎమ్మెల్యే జనసేనకు చెందిన వారే కావడం విశేషం. ఈ నేపథ్యంలో డీఎస్పీ వ్యవహారంలో పవన్ కల్యాణ్ అలా ఎందుకు స్పందిచాల్సి వచ్చింది? వెంటనే డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ఎందుకు రియాక్ట్ కావాల్సి వచ్చిందన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. మొత్తం మీద ఏదో జరుగుతుందన్న అనుమానం మాత్రం టీడీపీ అగ్రనాయకత్వంలో బయలుదేరింది. ఎస్పీ ఇప్పటికే డీఎస్పీ జయసూర్యపై విచారణ జరుపుతున్నారు. విచారణ జరుగుతున్న సమయంలో డిప్యూటీ స్పీకర్ ఈ వ్యాఖ్యలు చేయడంపై చర్చ నడుస్తుంది


Tags:    

Similar News