Pawan Kalyan : పవన్ వద్ద ప్లాన్ బి ఉందా? అందుకే ఆయన అలా వ్యవహరిస్తున్నారా?

జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ధీమాగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ విజయం కూటమిదేనని ఆయన బలంగా నమ్ముతున్నారు

Update: 2025-09-22 08:13 GMT

జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ధీమాగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ విజయం కూటమిదేనని ఆయన బలంగా నమ్ముతున్నారు. ప్రజలు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికే జైకొడతారని విశ్వసిస్తున్నారు. అందుకే తరచూ వైసీపీ మరోసారి అధికారంలోకి ఎలా వస్తుందని ఆయన పదే పదే చెబుతున్నారు. ఖచ్చితంగా పవన్ కల్యాణ్ ఏదో ఆలోచనలో ఉన్నారని అర్థమవుతుంది. ఆయన వద్ద బి ప్లాన్ ఉన్నట్లు జనసేన వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పాటయి ఏడాది మాత్రమే అయింది. ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది. అందుకే ఆయన పెద్దగా ప్రభుత్వ నిర్ణయాల విషయంలో జోక్యం చేసుకోవడం లేదని అంటున్నారు.

ఆదరణను చూసిన తర్వాత...
రానున్న కాలంలో కూటమి ప్రభుత్వంపై జనంలో ఉన్న ఆదరణను అనుసరించి ఆయన అడుగులు ఉంటాయని అంటున్నారు. కూటమిలోనే ఉంటూ తన వద్ద ఉన్న ప్లాన్ బిని అమలు చేయాలని భావిస్తున్నారు. ఒకవేళ జనంలో కూటమి ప్రభుత్వానికి చెక్కు చెదరని ఆదరణ ఉంటే మాత్రం ఇలాగే కొనసాగే వీలుందని అంటున్నారు. అలా కాకుండా ఏ మాత్రం వైసీపీ వైపు మొగ్గు చూపినా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారని చెబుతున్నారు. అయితే కూటమి నుంచి వైదొలగకుండానే కొన్ని షరతులు విధించే అవకాశం కూడా లేకపోలేదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు మౌనంగా ఉన్నానన్న అపప్రథ నుంచి ఆయన బయటపడి కూటమిని పవన్ కల్యాణ్ లీడ్ చేసే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు.
టీడీపీ కూడా...
ఎంటూ టీడీపీ కంటే బీజేపీలో పవన్ కల్యాణ్ అంటేనే ఎక్కువ నమ్మకం ఉంది. దానిని వినియోగించుకుని ముందుకు వెళతారంటున్నారు. అందుకే 2029 ఎన్నికల ప్రచారంలోనే తనను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న సామాజికవర్గానికి, అభిమానులకు కూడా ఆయన సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. జగన్ మరోసారి అధికారంలోకి రాకుండా ఉండాలంటే టీడీపికి తాను పెట్టే ఆప్షన్ కు తలవొంచాల్సిన పరిస్థితులు తప్ప మరొక దారి లేదు. అలాగని బయటకు వెళ్లి ఒంటరిగా పోటీ చేస్తే 2019 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయని వారికి తెలియంది కాదన్నది జనసేనాని అంచనా వేస్తున్నట్లు తెలిసింది. అందుకే ఇప్పుడే సమయం కాదని వేచి చూస్తున్నారన్న ప్రచారం బాగా జరుగుతుంది.
కేంద్రం అండదండలతో...
టీడీపీ ఒంటరిగా పోటీ చేసే సాహసం చేయకపోవడంతో పాటు బీజేపీ కూడా పవన్ కల్యాణ్ కు అండగా ఉంటుందన్న నమ్మకంతో ఆయన చివరి ఏడాది ఈ ప్లాన్ ను అమలు చేసే అవకాశం ఉందంటున్నారు. వచ్చే ఏడాది నుంచి ఢిల్లీ పర్యటనలు కూడా పవన్ కల్యాణ్ జోరుగా చేయడంతో పాటు రాష్ట్రానికి కావాల్సిన, రావాల్సిన పలు అవసరాలను తీర్చేందుకు సిద్ధమవుతున్నారని అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం అండదండలతో పాటు తనకున్న క్లీన్ ఇమేజ్ ను కాపాడుకుంటూ ముందుకు వెళ్లాలని, అవసరమైతే ఢిల్లీ పెద్దలతో చంద్రబాబును ఒప్పించి కీలక నిర్ణయాన్ని ఆయన నోటి నుంచి చెప్పే ప్రయత్నంలో పవన్ కల్యాణ్ ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?


Tags:    

Similar News