Janasena : పవన్ తప్పు చేస్తున్నారా? కాపులను, నేతలను పట్టించుకోవడం లేదా?

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యవహారం కాపు సామాజికవర్గంలో తీవ్ర అసంతృప్తి కలిగేలా చేస్తుంది

Update: 2026-01-19 07:51 GMT

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యవహారం కాపు సామాజికవర్గంలో తీవ్ర అసంతృప్తి కలిగేలా చేస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు గడుస్తున్నా కాపు సామాజికవర్గం సమస్యలను పట్టించుకోక పోవడాన్ని చాలా మంది సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. పవన్ కల్యాణ్ తో కేవలం కాపు సామాజికవర్గం మాత్రమే కాదు. గత ఎన్నికల్లో జనసేన తరుపున లక్షల రూపాయలు ఖర్చు చేసుకుని కూటమి విజయానికి పాటుపడిన వారికి కూడా పవన్ కల్యాణ్ దర్శనం భాగ్యం లభించడం లేదట. దీంతో అనేక మంది జనసేన నేతలు గుంభనంగా ఉన్నారు. కొందరు పార్టీ మారుతున్నారు. ఇటీవల చింతలపూడి జనసేన నేత గంగా సురేష్ వైసీపీలో చేరారు. ఇంకా మరికొందరు లైన్ లో ఉన్నారని చెబుతున్నారు.

జనసేన నేతల్లోనూ....
జనసేన అధికారంలోకి వస్తే తమకు ఏదో ఒక పదవి లేదంటే నామినేటెడ్ పోస్టు అయినా దక్కుతుందని భావించి గత ఎన్నికల్లో తెగించి నియోజకవర్గాల్లో పనిచేశారు. ఆస్తులు పణంగా పెట్టి చాలా మంది నేతలు కూటమి నేతల విజయం కోసం కష్టపడ్డారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు దాటుతున్నా వారిని నేతలుగా గుర్తించిన పాపాన పోలేదు. జనసేన నాయకత్వం వ్యవహరిస్తున్న తీరుతో జనసేన నేతలు తీవ్ర అసహనంతో ఉన్నారు. పవన్ కల్యాణ్ పై అభిమానం ఉన్నవాళ్లు కొద్దో గొప్పో ఉన్నారు తప్పించి.. సింహభాగం నేతలు మాత్రం పవన్ కల్యాణ్ తమను పట్టించుకోవడం లేదన్న అభిప్రాయానికి దాదాపు వచ్చేశారు.
తమ వాడనుకుంటే...
ఇక కాపు సామాజికవర్గం కూడా పవన్ కల్యాణ్ తమ వాడని భావించి గత ఎన్నికల్లో గంపగుత్తగా కూటమికి ఓట్లు వేసింది. అయితే వైసీపీ హయాంలోనే బెటర్ అన్నట్లు తయారైందని కాపు నేతలే సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానిస్తున్నారు. అన్నింటికీ వేల కోట్లు ఖర్చు పెడుతున్న కూటమి ప్రభుత్వం కాపు కార్పొరేషన్ కు మాత్రం నిధులు కేటాయించకపోవడాన్ని నిలదీస్తున్నారు. కాపు కార్పొరేషన్ కు నిధులు ఇవ్వకపోవడాన్ని పవన్ కల్యాణ్ ప్రశ్నించకపోవడాన్ని తప్పు పడుతున్నారు. పవన్ కల్యాణ్ నమ్ముకుని తాము నిండా మునిగామంటున్నారు. కాపు కాయడం తమ తప్పయిందని సోషల్ మీడియా వేదికగా వాపోతున్నారు. ఇప్పటికైనా గ్రౌండ్ లెవెల్ లో జరుగుతున్న నష్టాన్ని చూసి దానిని నివారించుకోలేకపోతే.. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీతో పాటు కూటమి కూడా భారీగా మూల్యం చెల్లించుకోక తప్పదన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News