Davos : దావోస్ పర్యటనకు పవన్ దూరంగా ఉంది అందుకేనా?

దావోస్ కు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకోకపోవడాన్ని జనసేన క్యాడర్ తప్పుపడుతుంది

Update: 2026-01-23 07:05 GMT

దావోస్ కు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకోకపోవడాన్ని జనసేన క్యాడర్ తప్పుపడుతుంది. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన దావోస్ పర్యటనలో రాజకీయాల్లో లేని మెగాస్టార్ చిరంజీవిని వెంట తీసుకెళ్లి ఆ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ను పెంచాలని ప్రయత్నిస్తుంటే, ఇక్కడ మాత్రం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కల్యాణ్ ను దావోస్ కు వెంట తీసుకోకపోవడాన్ని ఖచ్చితంగా ఆయనను నిర్లక్ష్యం చేయడమేనని అంటున్నారు. పవన్ కల్యాణ్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులున్నారు. ఆయనను వెంట తీసుకెళితే ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందే తప్ప నష్టం ఏముంటుందని నెట్టింట కొందరు నేరుగా టీడీపీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

చిరంజీవిని రేవంత్ తీసుకెళితే...
ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కల్యాణ్ ను దావోస్ పర్యటనకు దూరం పెట్టడం రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయడమేనన్న అభిప్రాయం జనసేన క్యాడర్ లో వ్యక్తమవుతుంది. పవన్ కల్యాణ్ వల్ల కాస్తో కూస్తో లాభం చేకూరుతుందే తప్ప నష్టమయితే జరగదు. లోకేశ్, టీజీ భరత్ వంటి వారిని వెంట తీసుకెళ్లడంలో తప్పులేదు. కానీ అదే సమయంలో పవన్ కల్యాణ్ ను తీసుకెళ్లకపోవడం మాత్రం ఖచ్చితంగా నాయకత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయమేనన్న అభిప్రాయం జనసేనలో వ్యక్తమవుతుంది. తెలంగాణలో మెగాస్టార్ చిరంజీవిని తన వెంట తీసుకెళ్లి ఆయనకు దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగస్వామ్యం కల్పించడంతో కొంత తెలంగాణ ఇమేజ్ పెరిగిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
అసలు విషయం ఇదే...
కానీ తెలుగుదేశ పార్టీ నేతల వాదన మరొకలా ఉంది. పవన్ కల్యాణ్ వస్తానంటే ఎందుకు తీసుకెళ్లరని, ఆయన అనాసక్తి చూపడం వల్లనే చంద్రబాబు నాయుడు ఒత్తిడి చేయలేదని అన్నారు. పవన్ కల్యాణ్ కేవలం దావోస్ పర్యటన మాత్రమే కాదు .. గత ఏడాది నవంబరు నెలలో విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సుకు కూడా పవన్ కల్యాణ్ దూరంగా ఉన్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. వారిద్దరి మధ్య సఖ్యత బాగానే ఉందని, కానీ పార్టీ నేతలు, కార్యకర్తలు లేనిపోని అపోహలకు తావివ్వవద్దని, ఏదైనా అనుమానలుంటే నేరుగా పవన్ కల్యాణ్ తో మాట్లాడి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని తెలుగుదేశం పార్టీ నేతలు ఆఫ్ ది రికార్డులుగా చెబుతున్నారు. మొత్తం మీద దావోస్ పర్యటనకు పవన్ దూరంగా ఉండటంపై మాత్రం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.


Tags:    

Similar News