నాలుగో పెళ్ళాం అంటూ వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్

లేని నాలుగో పెళ్లాం అంటే నువ్వే... రా జగన్ రా! అని అన్నారు పవన్ కళ్యాణ్

Update: 2024-02-28 17:12 GMT

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ, జనసేన ఉమ్మడి సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. జగన్ కు సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ అంటే మూడు పెళ్లిళ్లు, రెండు విడాకులు. అతడి దృష్టిలో నాలుగు పెళ్లిళ్లు అంటాడు. మరి ఆ నాలుగో పెళ్లాం ఎవరో తెలీదు.. మరి అది జగనేమో నాకు తెలియదన్నారు. లేని నాలుగో పెళ్లాం అంటే నువ్వే... రా జగన్ రా! అని అన్నారు పవన్ కళ్యాణ్. భారతీ మేడం గారూ మీకు కూడా చెబుతున్నాను.. మేం ఎప్పుడయినా సరే మిమ్మల్ని మేడం భారతి గారూ అని గౌరవంగా మాట్లాడతాం. మీ ఆయన ఇంత నీచంగా ప్రవర్తించినా గానీ, చంద్రబాబు అర్ధాంగిని మాట్లాడినా కానీ, నా భార్యను అన్నా కానీ మేం మిమ్మల్ని ఏమీ అనలేదన్నారు. పెళ్లాలు, పెళ్లాలు అంటాడు... ఆ మాట మేం మిమ్మల్ని అంటే ఎలా ఉంటుంది భారతి గారూ.. ఒక్కసారి ఆలోచించండన్నారు. పవన్ కళ్యాణ్ లో శాంతి, మంచితనం మాత్రేమ చూశారన్న జనసేనాని, ఇకపై మరో పవన్ కళ్యాణ్‌ను చూస్తారంటూ హెచ్చరించారు. వైసీపీ గూండాయిజాన్ని సహించేది లేదని, మక్కెలు విరగ్గొట్టి మడత మంచంలో పడేస్తామని హెచ్చరించారు.

పవన్ కళ్యాణ్ అంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు, జగన్‌ను అధఃపాతాళానికి తొక్కే వామనుడి పాదం అని అన్నారు. జగన్‌ను అధఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్‌ కళ్యాణేకాదంటూ హెచ్చరించారు. పొత్తులో భాగంగానే 24 అసెంబ్లీ సీట్లు తీసుకున్నానన్న పవన్ కళ్యాణ్.. 24 సీట్లేనా అని అవతలి పక్షం విమర్శించిందని అన్నారు. బలి చక్రవర్తి కూడా వామనుడిని చూసి ఇంతేనా అన్నారనీ.. నెత్తిన కాలుపెట్టి తొక్కితే ఎంతో తెలుస్తుందన్నారు.
చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరం అని.. చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి అవసరమైన వనరులు సమకూర్చగలరని, పారిశ్రామికవేత్తలను తీసుకురాగలరని అన్నారు. రాష్ట్రాన్ని ముందుకు నడిపించగలడనే నమ్మకంతోనే చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. నా తపన మీరు బాగుండాలనే.. అయితే యుద్ధ తంత్రం గురించి, పోల్ మేనేజ్ మెంట్ గురించి మీకేం తెలుసు? అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలంటే ఎంత ఖర్చవుతుందో మీకు తెలుసా? మన దగ్గర అంత డబ్బులు ఉన్నాయా? అందుకే 24 అసెంబ్లీ సీట్లు, 3 లోక్ సభ స్థానాలకు ఒప్పుకోవాల్సి వచ్చిందని పవన్ కళ్యాణ్ అన్నారు. నన్ను నమ్మండి... వ్యూహం నాకు వదిలేయండి... నేను మీకోసం పనిచేస్తాను అని స్పష్టం చేశారు. నన్ను నమ్మి నడుస్తున్న జనసైనికులు, వీర మహిళలు, యువత... నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబును నమ్మి నడుస్తున్న తెలుగు తమ్ముళ్లు, తెలుగు మహిళలు అందరూ కలిసి మహా యుద్ధంలో పాల్గొందామన్నారు.


Tags:    

Similar News