Pawan Kalyan : పవన్ కల్యాణ్ కు ప్రాధాన్యత దక్కడం లేదా? జనసైనికులు ఏమనుకుంటున్నారంటే?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పెద్దగా హైలెట్ కావడ లేదన్న బాధ జనసైనికుల్లో బలంగా వినిపిస్తుంది

Update: 2025-08-01 08:03 GMT

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పెద్దగా హైలెట్ కావడ లేదన్న బాధ జనసైనికుల్లో బలంగా వినిపిస్తుంది. ప్రతి విషయంలో కొందరే ప్రభుత్వంలో కీలకంగా మారుతున్నారని, కూటమి ప్రభుత్వంలో తమ అధినేతకు లభించాల్సిన గౌరవం, ప్రాధాన్యత లభించడం లేదని కూడా పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఎక్కువగా కనపడుతుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అన్ని శాఖలపైనా, అన్ని రకాలుగా మొదటి స్థానంలో ఉండటం ఎవరూ కాదనరని, కానీ సెకండ్ ప్లేస్ లో ఉండాల్సిన తమ అధినేత పవన్ కల్యాణ్ ను మాత్రం కూటమి ప్రభుత్వం విస్మరిస్తుందన్న అభిప్రాయం వారిలో బాగా కనపడుతుంది.

అమరావతి భూ సేకరణకు...
అయితే పవన్ కల్యాణ్ కూడా ఇటీవల కాలంలో కొంత ప్రభుత్వ నిర్ణయాలపై అభ్యంతరం చెబుతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధాని ప్రాంతంలో రెండో విడత భూ సేకరణ విషయంలో పవన్ కల్యాణ్ మంత్రివర్గ సమావేశంలోనే బహిరంగంగా అభ్యంతరం చెప్పిన నేపథ్యాన్ని వారు గుర్తుచేస్తున్నారు. అందుకే రెండో విడత భూ సేకరణ ఆగిందని జనసైనికులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రజల్లో కొన్నివిషయాల పట్ల తీవ్ర వ్యతిరేకత వస్తుందన్న కారణంగానే ఆయన ఈ విధమైన అభ్యంతరాలు తెలుపుతున్నారంటున్నారు. రైతులు తమకు ఇష్టముంటేనే రెండో విడత భూసేకరణకు ఇవ్వాలని కూడా కోరడం కూడా కొంత చర్చజరుగుతుంది.
ఆర్టీసీ స్థలాన్ని...
తాజాగా విజయవాడలోని ఆర్టీసీ పాత బస్టాండ్ స్థలాన్ని లూలు మాల్ కు కేటాయించడంపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చజరుగుతుంది. దీనిపై కూడా పవన్ కల్యాణ్ కొంత అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది. అతి విలువైన స్థలాన్ని లులూ సంస్థకు అప్పగించడం తో పాటు దాని విలువ వేల కోట్ల రూపాయలు ఉండటం, 99 ఏళ్లకు లీజుకు ఇవ్వడం, పెట్టుబడులు తక్కువగా ఉండటంపై ఇప్పటికే అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ కూడా ఈ ప్రతిపాదనపై కొంత వ్యతిరేకత వ్యక్తం అయ్యే అవకాశముందని తెలుస్తోంది. దీంతో పాటు నాలా చట్ట సవరణ ప్రతిపాదనను కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యతిరేకించడంతో భవిష్యత్ లో కూటమి ప్రభుత్వం ఎలా ముందుకు సాగుతుందన్న ప్రశ్నలు వినపడుతున్నాయి.


Tags:    

Similar News