పలు అవార్డులను కొల్లగొట్టిన ఆంధ్రప్రదేశ్.. ఎంతో ఆనందం

భారతదేశంలోని ఎన్నో జిల్లాలలో వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ విధానాన్ని అమలు చేస్తూ ఉన్నారు.

Update: 2024-02-15 16:32 GMT

భారతదేశంలోని ఎన్నో జిల్లాలలో వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ విధానాన్ని అమలు చేస్తూ ఉన్నారు. అయితే వీటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పలు అవార్డులను కొల్లగొట్టడం విశేషం. దేశవ్యాప్తంగా 538 జిల్లాలు అవార్డుల కోసం పోటీపడ్డాయి. ఆంధ్రప్రదేశ్ ఏకంగా ఆరింటిని గెలుచుకుంది. ఇందులో రెండు బంగారు బహుమతులు కూడా ఉన్నాయి. ఒకటి కాకినాడ జిల్లా ఉప్పాడ జమ్దానీ చీరలకు, అల్లూరి సీతారామ రాజు జిల్లాకు చెందిన అరకు కాఫీకి మొదటి స్థానం దక్కింది. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే.. వ్యవసాయేతర ఉత్పత్తుల విభాగంలో రాష్ట్రం ఆరు అవార్డుల్లో ఐదు అవార్డులను గెలుచుకుంది. ఇక ఏపీ ఒక వ్యవసాయ ఉత్పత్తి కేటగిరీకి మాత్రమే దరఖాస్తు చేసుకోగా.. అందులో కూడా స్వర్ణం సాధించింది. జిల్లా స్థాయి అవార్డుల్లో 50% రాష్ట్రానికి దక్కడం గర్వించదగ్గ విషయం. ఆరు అవార్డుల్లో ఐదు చేనేత ఉత్పత్తులకే దక్కాయి. ఇక అరకు కాఫీకి పలువురు ప్రముఖులు కూడా ప్రశంసించారు.

ఏపీలోని మొత్తం 26 జిల్లాలు అవార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. చేనేత, హస్తకళలు, వ్యవసాయ ఉత్పత్తులతో సహా 14 ఉత్పత్తులు షార్ట్‌లిస్ట్ చేయగా, సెలక్షన్‌ కమిటీ ఏపీకి వచ్చి ఈ 14 జిల్లాలను సందర్శించి, డాక్యుమెంటేషన్‌ను ధృవీకరించింది. ఆరు ప్రతిష్టాత్మక అవార్డులను ఆంధ్రప్రదేశ్ కైవసం చేసుకోవడంతో అధికారులను సీఎం జగన్‌ అభినందించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వన్‌ డిస్ట్రిక్ట్‌ వన్‌ ప్రొడక్ట్‌-ఓడీఓపీలో ఒక్క ఏపీకే 6 అవార్డులు వచ్చాయి. ఉప్పాడ జామ్దాని చీరలు, అరకు కాఫీకి బంగారు పతకాలు రాగా.. పొందూరు కాటన్, కోడుమూరు గద్వాల్‌ చీరలకు కాంస్య పతకాలు లభించాయి. మదనపల్లె పట్టు, మంగళగిరి చేనేత చీరలకు ప్రత్యేక జ్యూరీ అవార్డులు లభించాయి. సామాజిక, ఆర్థిక అభివృద్దిని ప్రోత్సహించే లక్ష్యంతో దేశంలోని ప్రతి జిల్లా నుంచి ఒక ఉత్పత్తిని ఎంపిక చేసి, బ్రాండింగ్, విస్తృత ప్రచారం కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం – వన్‌ డిస్ట్రిక్ట్‌ వన్‌ ప్రొడక్ట్‌. న్యూఢిల్లీలో జరిగిన అవార్డుల కార్యక్రమంలో ఏపీకి ఈ అవార్డులను అందించారు.


Tags:    

Similar News