Anakapalli : బాలిక పేరిట వంద ఎకరాలు.. తల్లికి వందనం పథకం బయటపెట్టిన రెవెన్యూ అధికారుల నిర్వాకం

అనకాపల్లి జిల్లాలో రెవెన్యూ అధికారుల నిర్వాకం బయటపడింది. ఎనిమిదేళ్ల బాలిక పేరిట వంద ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు చేర్చారు

Update: 2025-06-20 06:11 GMT

అనకాపల్లి జిల్లాలో రెవెన్యూ అధికారుల నిర్వాకం బయటపడింది. ఎనిమిదేళ్ల బాలిక పేరిట వంద ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు చేర్చారు.అనకాపల్లి జిల్లా కసింకోట మండలానికి చెందిన వెంకట హర్షిణి పేరిట వంద ఎకరాల భూమి ఉందని తెలుసుకుని బాలిక కుటుంబ సభ్యులే ఆశ్చర్యపోయారు. తమకు తెలియకుండా ఇంతభూమి బాలిక పేర ఎలా వచ్చిందని వారు భయపడిపోయారు. ఎనిమిదో తరగతి చదువుతున్న హర్షిణికి ఇటీవల తల్లికి వందనం నిధులు ప్రభుత్వం నుంచి జమ కాలేదు. తమకు అర్హతలున్నా ఎందుకు జమ కాలేదని హర్షిణి తల్లిదండ్రులు ఆవేదన చెందుతూ సచివాలయానికి వెళ్లారు.

గ్రామ సచివాలయానికి వెళితే...
అయితే ఇందుకు సంబంధించి కారణాలు తెలుసుకునేందుకు వారు గ్రామ సచివాలయానికి వెళ్లి తమ కుమార్తెకు అన్న అర్హతలున్నా ఎందుకు తల్లికి వందనం నిధులు జమ కాలేదని తల్లిదండ్రులు కోరారు. అయితే ఈఫిర్యాదును పరిశీలించిన సచివాలయం సిబ్బంది హర్షిణి పేరిట వంద ఎకరాల భూమి ఉందని అందుకే తల్లికి వందనం నిధులు పడలేదని చెప్పడంతో హర్షిణి కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యం నుంచి తేరుకుని తమ భూమి కాదని చెప్పినా సచివాలయ సిబ్బంది రెవెన్యూ అధికారులను సంప్రదించాలని కోరారు. రెవెన్యూ అధికారులను సంప్రదిస్తే ఫలితం లేదని భావించి హర్షిణి తమకు తెలిసిన కొందరు పెద్దలకు ఈ విషయాన్ని వివరించారు.
రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమే...
అయితే ఈ విషయం ఆనోటా ఈనోటా తెలిసిన కొందరు వెంటనే హర్షిణి తల్లి దండ్రులను అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ వద్దకు తీసుకెళ్లారు. తమకు తల్లికి వందనం నిధులు పడలేదని, హర్షిణి పేరిట వంద ఎకరాల భూమి ఎలా వచ్చిందో తమకు తెలియదని వారు చెప్పడంతో వెంటనే రెవెన్యూ అధికారులను పిలిపించి కొణతాల విచారించారు. రెవెన్యూ అధికారుల తప్పిదంతోనే వంద ఎకరాలు బాలిక హర్షిణ పేరట రెవెన్యూ అధికారులు కేటాయించారని, వీరి నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని అంటున్నారు. ఇలాంటి సిత్రాలు ఇక ఎన్ని ఉన్నాయో? రెవెన్యూ అధికారుల లీలలు ఏ మాత్రం ఉన్నాయోనన్న అనుమానం మాత్రం అనకాపల్లి జిల్లాలో అందరికీ కలుగుతుంది. మొత్తం మీద తల్లికి వందనం నిధులు వంద ఎకరాల భూమిని తిరిగి ప్రభుత్వ పరం చేశాయనే చెప్పాలి.


Tags:    

Similar News