Montha Cyclone : మొంథా భయపెట్టింది... బీభత్సం సృష్టించింది
మొంథా తుపాను భయపెట్టింది. అలాగే బీభత్సం సృష్టించింది.
మొంథా తుపాను భయపెట్టింది. అలాగే బీభత్సం సృష్టించింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా జిల్లాల్లోని అనేక ప్రాంతాలు విలవిలలాడిపోయాయి. ఒకవైపు వర్షం మరొక వైపు భయంకరమైన గాలులతో కాళరాత్రి గడిచింది. తుపాను భారీగా దెబ్బతీస్తుందన్న ముందస్తు అంచనాలతో ప్రభుత్వం అప్రమత్తమై పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి దాదాపు 39 వేల మందిని కోస్తా తీర ప్రాంతంలో ఉన్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించింది. ప్రాణనష్టం నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం శక్తి వంచన లేకుండా పనిచేసింది. అనేక ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్తు స్థంభాలు నేలకొరిగినా వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.
బాగా ప్రభావితమైన...
ప్రథానంగా విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు బాగా ఎఫెక్ట్ అయ్యాయి. భారీ వర్షం ఇక్కడే కురిసింది. బాపట్ల ప్రాంతంలో సైక్లోన్ 'మొంథా' కారణంగా అత్యంత తీవ్రమైన వర్షాలు కురిశాయి. ఈ ప్రాంతంలో ఎప్పుడైనా 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని అధికారులు తెలిపారు. గంటకు 90 కిలోమీటర్ల వరకు ఈదురుగాలులు వీచాయని చెబుతున్నారు. విజయవాడ మరియు గుంటూరు ప్రాంతాల్లో అడపాదడపా వర్షాలు కురిసాయి. తుఫాను తీరం దాటే సమయానికి విజయవాడ - గుంటూరు - అమరావతి ప్రాంతమంతా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులతో భారీ వర్షపాతం కురిసింది. నెల్లూరు జిల్లా కావలిలో 12.2 సెంటీమీటర్ల వర్షపాతం, దగదర్తిలో 12 సెంటీమీటర్లు వర్షపాతం నమోదయింది.
అత్యధిక వర్షపాతం...
ప్రకాశం జిల్లా సింగరాయకొండలో 10.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. విశాఖ-కిరండూల్ రైల్వే లైన్‌లో ట్రాక్ ధ్వంసమైంది. ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల వి మొంథా తుపాను ధ్వంసం సృష్టించింది. విశాఖ-కిరండూల్ సింగిల్ రైల్వే లైన్, అరకు రైల్వే టన్నెల్ నెంబర్ 32ఏ వద్ద రైల్వే ట్రాక్ ధ్వంసమయింది. చిమిడిపల్లి.. బొర్రా గుహలు రైల్వే స్టేషన్ల మధ్యలోనూ రైల్వే ట్రాక్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. మొంథా తుపాను నేపథ్యంలో ఏపీలో ఇప్పుడు కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి - నెల్లూరు జిల్లా కావలి, ఉలవపాడులో 17 సెం.మీ, దగదర్తిలో 15.5 సెం. మీ, ప్రకాశం జిల్లా సింగరాయకొండలో 12 సెం.మీ, విశాఖలో 10.8 సెం.మీ, ఒంగోలులో 10.4 సెం.మీ, నెల్లూరులో 10 సెం.మీ, నర్సాపురంలో 10 సెం.మీ, కాకినాడలో 6.4 సెం.మీ వర్షపాతం నమోదు అయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
కాకినాడ తీరంలో...
తుపాను ధాటికి కాకినాడ తీరం అల్లకల్లోలంగా మారింది. తాళ్లరేవు నుంచి తొండంగి మండలం వరకు తీరం వెంబడి ఉవ్వెత్తున అలలు ఎగసిపడుతున్నాయి. యు.కొత్తపల్లి మండలం కొమరిగిరి నుంచి కొనపాపపేట వరకు రాకాసి అలలు దాడి చేయడంతో చాలావరకు రహదారి ధ్వంసమైంది. తీరం వెంబడి రాళ్ల గట్టు ఉన్నప్పటికీ 8 నుంచి 10 అడుగుల ఎత్తున అలలు ఎగసిపడటంతో సముద్రం నీరు చేరి పొలాలు ముంపునకు గురయ్యాయి. ఈదురుగాలుల కారణంగా నేలకొరిగిన చెట్లు, విద్యుత్తు స్థంభాలతో కొంత భీతావహ పరిస్థితి నెలకొంది. తీరప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ఇళ్లను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించడంతో పెద్ద ముప్పు తప్పినట్లయింది.