Cyclone Montha Effect : ప్రచండగాలులు.. తీర ప్రాంతం అల్లకల్లోలం...ఐదు గంటలే కీలకం
మొంథా తుపాను తీరం దాటే సమయం దగ్గరపడుతుంది. దీంతో ప్రచండ గాలులు వీస్తున్నాయి
మొంథా తుపాను తీరం దాటే సమయం దగ్గరపడుతుంది. దీంతో ప్రచండ గాలులు వీస్తున్నాయి. మరొక గంటలో మొంథా తుపాను తీరాన్ని తాకనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు వరకూ అతి భారీ వర్షాలు బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకూ అత్యంత కీలకమని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే తుపాను ప్రభావం కోస్తా తీర ప్రాంతంలో కనిపిస్తుంది. మచిలీపట్నానికి మొంథా తుపాను అరవై కిలోమీటర్లు, కాకినాడకు 140 కిలోమీటర్ల దూరంలో ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. ఉవ్వెత్తున అలలు ఎగిసి పడుతున్నాయి.
చెట్లు విరిగిపడి....
ఇప్పటికే విశాఖజిల్లాలో పలు చోట్ల చెట్లు విరిగిపడుతున్నాయి. విద్యుత్తు స్థంభాలు నేలకొరుగుతున్నాయి. మచిలీపట్నం ప్రాంతానికి చేరుకునేసరికి మొంథా తుపాను భీకర తుపానుగా మారనుంది. ఇప్పటికే మంగినపూడి బీచ్ లో భారీ వృక్షాలు విరిగి పడుతున్నాయి. కాకినాడ వద్ద తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. కాకినాడ, యానాం తీర ప్రాంతాలకు ఉప్పెన ముప్పు పొంచి ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. యానాంలో పలు చెట్లు నేలకూలాయి. అయితే ఎప్పటికప్పుడు సిబ్బంది వాటిని తొలగిస్తున్నారు. అగ్నిమాపక, విద్యుత్తు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ముందుకు వచ్చిన సముద్రం...
మొంథా తుపాను తీరం దాటే సమయంలో గంటకు వంద కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కోస్తాతీరంలో సముద్రం ముందుకు వచ్చింది. విశాఖలో భారీ వర్షం పడుతుంది. దీనిని సూపర్ సైక్లోన్ గా చెబుతున్నారు. నెల్లూరు, ప్రకాశం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు ముప్పు పొంచి ఉందని అధికారులు భావించి ప్రజలను అప్రమత్తం చేశారు. విద్యుత్తు వ్యవస్థ, కమ్యునికేషన్స్ వ్యవస్థ దెబ్బతినే అవకాశముందని చెబుతున్నారు. సైక్లోన్ యాభై కిలోమీటర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. భయానకంగా సముద్ర తీర ప్రాంతాలు ఇప్పటికే మారిపోయాయి. అంతకంతకూ ఈదురుగాలులు పెరుగుతుండటంతో పూర్తిగా అన్ని ప్రాంతాలు కర్ఫ్యూ విధించినట్లు కనిపిస్తుంది.