Cyclone Effect : తుపాను ఎఫెక్ట్.. జాతీయ రహదారులపై హై అలెర్ట్
ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ రహదారులపై వెళ్లే వాహనాలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది
ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ రహదారులపై వెళ్లే వాహనాలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. మొంథా తుపాను ప్రభావంతో అతి భారీ వర్షాలతో పాటు గంటకు వంద కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమున్నందున హైవేలపై ప్రయాణించే వారు అవసరమైతే వాహనాలను ట్రక్ బే లలో నిలుపుకోవాలని, సాహసం చేయవద్దని సూచించారు. తుపాను తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, ఆ సమయంలో ప్రయాణించడం ప్రమాదకరమని అధికారులు వెల్లడించారు. మరొకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని జిల్లాల్లోని జలాశయాల వద్ద హైఅలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లాలోని తాండవ, రైవాడ, కోనాం, పెద్దేరు జలాశయాల వద్ద హైఅలర్ట్ ను ప్రకటించింది.
సెలవులను రద్దు చేసి...
ఏఈల బృందం 24 గంటలూ విధులు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేసింది. సిబ్బందికి సెలవులు రద్దుచేసిన అధికారులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండాలని కోరారు. తుపాను దృష్ట్యా అప్రమత్తమైన విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.. విద్యుత్ తీగలు పడి సరఫరాకు అంతరాయం కలగవచ్చని చెప్పారు. విద్యుత్ తీగలు తెగిపడితే వెంటనే సిబ్బందికి తెలియజేయాలని, తడిసిన స్తంభాలు, స్విచ్ బోర్డులు, తీగల వద్ద చెట్టకొమ్మలు తాకవద్దని సూచించారు. సిబ్బందికి లేదా ఎమర్జెన్సీ నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం చెప్పండి.. ఏపీఈపీడీసీఎల్ టోల్ ఫ్రీ నంబర్ : 1912, కంట్రోల్ రూమ్ నంబర్ : 94409 04477 కు కాల్ చేయాలని కోరారు. ముందు జాగ్రత్తగా ప్రజలు మంచినీటిని నిల్వ చేసుకోవాలని, జనరేటర్లు ఉన్నవారు డీజిల్, ఆయిల్ నిల్వ చేసుకోవాలని ఏపీఈపీడీసీఎల్ అధికారులు తెలిపారు.