Cyclone Alert : తుపాను ప్రభావం.. ఈ జిల్లాల్లో అలెర్ట్ గా ఉండాల్సిందేనట
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది
దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపాను గా మారే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలుఏర్పడనున్నాయి. రానున్న కొన్ని గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. తర్వాత తుపాను గా మారే అవకాశుముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాల ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని, ఇప్పటికే చేపల వేటకు వెళ్లిన వారు వెంటనే తీర ప్రాంతానికి చేరుకోవాలని కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
ఈ ప్రాంతంలో భారీ వానలు...
అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో ఎక్కువగా దక్షిణ కో్స్తా ప్రాంతంలో మోస్తరు వానలు, ఉత్తర కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ కోస్తాలో నాలుగు రోజుల పాటు వానలు పడతాయని వెల్లడించింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది. అదే సమయంలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశమున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అలెర్ట్ చేయాలని సూచించింది. కోస్తాంద్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వానలు పడనున్నాయని పేర్కొంది.
తెలంగాణలో ఈ జిల్లాల్లో...
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. రేపటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకూ తేలికపాటి వానల నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. హైదరాబాద్ తో పాటు తూర్పు తెలంగాణ జిల్లాల్లో వానలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రధానంగా వనపర్తి, వికారాబాద్, జోగులాంబ గద్వాల్, నారాయణపేట, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలతో పాటు హైదరాబాద్ లోనూ అక్కడక్కడ వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే ఈ నాలుగు రోజుల పాటు చలిగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది.