Weather Report : డిసెంబరు వరకూ వానలు తప్పవట.. ఇదే రీజన్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో రెండు రోజుల పాటు వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో రెండు రోజుల పాటు వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఛత్తీస్ గఢ్ ప్రాంతంలో అల్పపీడనం గా మారే అవకాశమున్నందున ఆ ప్రభావంతో మోస్తరు నుంచి తేలికపాటి వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే భారీ వర్షాలు మాత్రం ఎక్కడా పడే ఛాన్స్ లేదని కూడా తెలిపింది. మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడతాయని చెబుతోంది. రెండు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశముందని తెలిపింది. అలాగే నిన్న మొన్నటి వరకూ కురిసిన భారీ వర్షాలకు నదులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయని, ఎవరూ దాటి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచిస్తున్నారు అధికారులు.
మోస్తరు వర్షాలు...
ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి తేలిక పాటి వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ పేర్కొంది. కొన్ని జిల్లాల్లో పిడుగులు పడతాయని కూడా చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. కృష్ణా, గుంటూరు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి జల్లులు, మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నదుల వద్ద వరద ప్రవాహం తగ్గుముఖం పడుతున్నప్పటీకి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాలు అలెర్ట్ గా ఉండాలని సూచించింది.
తెలంగాణలోనూ రెండు రోజులు...
తెలంగాణలోనూ మరో రెండు రోజుల పాటు వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈశాన్యరుతు పవనాల కారణంగా వానలు కొనసాగే అవకాశముందని తెలిపింది. డిసెంబరు వరకూ వానలు తప్పవని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణ వర్ష పాతం కంటే ఇప్పటికే తెలంగాణలో ఎక్కువ శాతం వర్షపాతం నమోదయిందని అధికారులు స్పష్టం చేశారు. అలాగే ఈరోజు కూడా అనేక జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అదే సమయంలో కొన్ని చోట్ల పిడుగులు కూడా పడే అవకాశముందని, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని చెప్పారు.