Weather Report : ఆంధ్రప్రదేశ్ కి మళ్లీ తుపాను ముప్పు.. ఎన్ని రోజులు వానలంటే?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
లక్షద్వీప్, మాల్దీవులు సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. ఇదే ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. సముద్రమట్టానికి 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ నెల 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావవరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 24న దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. వాయుగుండంగా మారాక పశ్చిమ వాయవ్య దిశగా కదిలి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావారణ శాఖ వెల్లడించింది. వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
రేపటి నుంచి వానలు...
వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ, తమిళనాడులో ఈ నెల 22 నుంచి 25 వరకు వర్ష సూచనలను విశాఖ వాతావరణ శాఖ జారీ చేసింది.చాలాచోట్ల మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. వాయుగుండం తుపాను గా మారి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదిలే అవకాశముందని పేర్కొంది. ఈ ప్రభావంతో ఈ నెల 26వ తేదీ నుంచి ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని, 27, 28 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 30వ తేదీ వరకూ ఆంధ్రప్రదేశ్ లో వానలు కురిసే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది.
చలి గాలులు పెరుగుతూ...
తెలంగాణలో చలిగాలుల తీవ్రత పెరిగింది. ఈ నెల 22వ తేదీ నుంచి తెలంగాణలో వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉందని, కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపింది. కొన్ని చోట్ల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడిచింది. తెలంగాణలోని తొమ్మిది జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఆ జిల్లాల్లో సింగిల్ డిజిట్ కు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశముందని పేర్కొంది. ఈ తొమ్మిది జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాణిలో అత్యల్పంా 7.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఇటీవల నమోదయ్యాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చలిగాలుల నుంచి కాపాడుకోవాలని సూచించింది.