Heavy Rain Alert : నాలుగు రోజుల పాటు వానలే వానలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశముందని పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ చెప్పింది. ఇది ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా మారనుండటంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.రేపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడన ప్రభావంతో రానున్న నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో కుండపోత వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
భారీ నుంచి...
ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశముందని, కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశముందని హెచ్చరించింది. ఈరోజు తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప, పల్నాడు, గుంటూరు, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణాలోనూ....
తెలంగాణలోనూ రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అల్పపీడనం ప్రభావం కారణంగానే వర్షాలు పడతాయని తెలిపింది. గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. జోగులాంబ గద్వాల్, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశముందని, రైతులు, పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.