Weather Report : ఏపీలో ఇక్కడ అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు వెళ్లేవారికి అలెర్ట్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది

Update: 2025-10-15 04:34 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు తిరోగమనంలో ఉన్నాయని, ఈ ప్రభావంతో వర్షాలు పడతాయని చెప్పింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదే సమయంలో గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు ఈరోజు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ ప్రాంతంలో భారీ వర్షాలు...
ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాల్లో మూడు రోజుల పాటు వానలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశముందని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమలో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాలోనూ అతి భారీ వర్షాలు పడతాయని చెప్పింది. అలాగే చిత్తూరు, అన్నమయ్య, కడప, నంద్యాల, నెల్లూ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 15 నుంచి పదహారో తేదీ వరకూ నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించి, ఈశాన్య రుతపవనాల రాక మొదలవుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఎల్లో అలెర్ట్...
తెలంగాణలోనూ మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య రుతుపవనాలు ప్రారంభయ్యే అవకాశమున్నందున ఈ మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని, అందుకే కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. ఈరోజు సంగారెడ్డి, వికారాబాద్, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడి బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది. పిడుగులు పడే అవకాశం కూడా ఉందని పేర్కొంది.


Tags:    

Similar News