Weather Report : చినుకు పడుతుందంటే..గుండెల్లో గుబులే.. మరో అల్పపీడనం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

Update: 2025-11-04 04:04 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ అల్పపీడనం ప్రభావంతో వానలు కొనసాగుతాయని చెప్పింది. జులై నెలలో మొదలయిన వానలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. దాదాపు నాలుగు నెలల నుంచి కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు, తుపానులతో రెండు రాష్ట్రాల్లో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రైతులు తమ పంటలను తీవ్రంగా నష్టపోయారు. ఆస్తి నష్టం భారీగానే జరిగింది. మరో అల్పపీడనం అన్న వినిన వెంటనే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో బాంబు పేలుతున్నట్లుంది.

ఈ జిల్లాల్లో వానలు...
ఆంధ్రప్రదేశ్ లోనూ మరో రెండు రోజులు వానలు పడతాయని విశాఖపట్నం వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. వాయువ్య దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో వానలు పడతాయని చెప్పింది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల వానలు పడతాయని తెలిపింది. ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ కూడా ప్రకటించింది. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రమే వానలు పడతాయని పేర్కొంది. తిరుపతి, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని వెల్లడించింది.
తెలంగాణలోనూ రెండు రోజులు...
తెలంగాణలోనూ మరో రెండు రోజుల పాటు వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ తో పాటు మరికొన్ని జిల్లా్లలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని, గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా తెలిపింది. ఈరోజు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడితే మాత్రం వానలు ఇంకా కొనసాగే అవకాశముందని కూడా చెప్పింది. అయితే భారీ వర్షాలు మాత్రం కురవవని, ప్రజలు మాత్రం కొంత అప్రమత్తంగా ఉండాలని, రహదారులపై ప్రయాణించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.



Tags:    

Similar News