Rain Alert : వానలకు స్వల్ప విరామం.. మళ్లీ మొదలయ్యేది ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు కూడా అక్కడక్కడ వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు కూడా అక్కడక్కడ వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం లేదని స్పష్టం చేసింది. పొడి వాతావరణం నెలకొని ఉంటుందని చెప్పింది. ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశముందని తెలిపింది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. ప్రజలు ఆ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రైతులు తమ పంట ఉత్పత్తులను వానకు తడిసిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు...
ఆంధ్రప్రదేశ్ లో నేడు పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ చెప్పింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని తెలిపింది. కొన్నిచోట్ల పిడుగులు పడే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈరోజు నెల్లూరుతో పాటు రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. తొమ్మిది జిల్లాలకు పిడుగులు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. పొలాలకు వెళ్లే రైతులు, కూలీలు, పశువుల కాపర్లు చెట్ల కింద ఉండకూడదని కోరింది.
అధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో...
తెలంగాణలోనూ తేమ గాలులు వీస్తున్నందున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రెండు నుంచిమూడు డిగ్రీలు సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పింది. ఈరోజు రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది.