YSRCP : జగన్ కు షాక్...వైసీపీకి సీనియర్ నేత గుడ్ బై చెప్పేసినట్లేనట
వైసీపీలో సీనియర్ నేత ఆ పార్టీకి రాజీనామా చేసినట్లేనని ప్రచారం జరుగుతుంది.
వైసీపీలో సీనియర్ నేత ఆ పార్టీకి రాజీనామా చేసినట్లేనని ప్రచారం జరుగుతుంది. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కుటుంబం వైసీపీకి దూరమయ్యేటట్లు కనిపిస్తుంది. గత కొంత కాలంగా ఆ కుటుంబం వ్యాపారాలకు మాత్రమే పరిమితమయింది. పార్టీ విషయాలను కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం తర్వాత జరిగిన పరిస్థితులతో మేకపాటి కుటుంబం వైసీపీని వీడేందుకు సిద్ధమయినట్లు చెబుతన్నారు. వైసీపీకి నెల్లూరు జిల్లాలో ఒకప్పుడు పెద్ద దిక్కుగా ఉన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి వయోభారంతోనూ ఆయన పార్టీకి దూరమయ్యారు. ఆయన తనకు రాజ్యసభ పదవి ఇవ్వలేదన్న అసంతృప్తితో ఉన్నారు. అయితే మేకపాటి గౌతమ్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో ఆయనకు నాడు జగన్ రాజ్యసభ పదవి ఇవ్వలేదు.
క్లిష్టసమయంలో...
మేకపాటి రాజమోహన్ రెడ్డి కీలకమైన సమయంలోనూ, క్లిష్ట పరిస్థితుల్లోనూ పార్టీకి తోడుగా పార్టీ అధినేత జగన్ వెన్నంటే నడిచిన సీనియర్ నాయకుడు.అలాంటిది అధికారంలోకి వచ్చిన తర్వాత తనను పట్టించుకోలేదన్న అసంతృప్తిలో పెద్దాయన ఉన్నాడు. మరొకవైపు తన సోదరుడు ఉదయగిరి శాసనసభ్యుడిగా ఉన్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై వేటు వేయడాన్ని కూడా మేకపాటి రాజమోహన్ రెడ్డి ఒకింత కుటుంబ పరంగా ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. మరొకవైపు ఆత్మకూరు నుంచి ఉప ఎన్నికల్లో గెలిచిన విక్రమ్ రెడ్డి కూడా రాజకీయాల పట్ల అంత ఆసక్తి చూపకపోవడంతో తమ కుటుంబం పార్టీ నిర్ణయాల కారణంగానే రాజకీయాలకు దూరం అయ్యారన్న బాధలో మేకపాటి ఉన్నారని తెలిసింది.
వ్యాపారానికే పరిమితం...
పార్టీ స్థాపించిన దగ్గర నుంచి జగన్‌తో కలసి ఉన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇక రాజకీయాలకు రాం రాం చెప్పాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. మరొకవైపు విక్రమ్ రెడ్డి కూడా ఆసక్తి కనపర్చకపోవడం, వ్యాపారాలు చూసుకోవాల్సి రావడంతో ఇక పార్టీకి దూరంగా ఉంటేనే మేలు అన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఎక్కువగా మేకపాటి కుటుంబం హైదరాబాద్ కే పరిమితమయినట్లు చెబుతున్నారు. వైసీపీ అధినేత జగన్ తరచూ పెడుతున్న సమావేశాలకు కూడా వీరు హాజరు కాకపోవడం నెల్లూరు రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అయితే మేకపాటి కుటుంబం టీడీపీలో చేరతారన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ అందులో వాస్తవం లేదంటున్నారు. జగన్ కూడా ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రత్యామ్నాయ నేతను వెతుక్కునే పనిలో పడ్డారని తెలిసింది. మొత్తం మీద సీనియర్ నేత మేకపాటి కుటుంబం రాజకీయాలకు దూరమవుతుందన్న కామెంట్స్ సింహపురిలో బలంగా వినిపిస్తుంది.