Andhra Pradesh :దావోస్ లో ఏపీకి పెట్టుబడులు రానిది అందుకేనా? టాప్ డిస్కషన్ ఇదే

దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలు ముగిశాయి. ఆంధ్రప్రదేశ్ కు ఆశించినంత పెట్టుబడులు రాలేదు

Update: 2025-01-24 04:33 GMT

దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలు ముగిశాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలూ తమ ప్రాంతాల్లో పెట్టుబడులను పెట్టాలని ఆహ్వానించాయి. పలు సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. పలుచర్చలు జరిపారు. అనేక సమావేశాల్లో పాల్గొని తమ రాష్ట్రానికి వస్తే ఏమేం లాభాలు ఉంటాయి? ఎంత మేరకు పారిశ్రామికంగా రాయితీలు లభిస్తాయి? అన్న అంశాలపై రాష్ట్రాల నేతలు వివరించే ప్రయత్నం చేశారు. అయితే ఈసారి దావోస్ లో మాత్రం పెట్టుబడులను తీసుకు రావడంలో ఆంధ్రప్రదేశ్ వెనకబడిందనే చెప్పాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఒప్పందాలు చేసుకునే దానికంటే ఎక్కువగా ఆయన ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేందుకు మాత్రమే ఎక్కువగా శ్రమించారని అర్థమవుతుంది.

అననుకూలతలు...
తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అయితే ఆ రెండు రాష్ట్రాలకు ప్రత్యేకత ఉంది. తెలంగాణకు హైదరాబాద్, మహారాష్ట్రకు ముంబయి, పూనే వంటి నగరాలున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ కు మాత్రం విశాఖపట్నం తప్పించి మరే ముఖ్యమైన నగరం లేకపోవడం ఇందుకు కారణంగా చూస్తున్నారు. పెట్టుబడులు పెట్టాలన్నా,పరిశ్రమలు స్థాపించాలన్నా అందుకు అనుకూలమైన పరిస్థితులు ఉండాలి. వాతావరణం కూడా అనువుగా ఉండాలి. ఈ రెండు ఏపీకి లేకపోవడంతోనే అసలు సమస్య అన్న భావన వ్యక్తమవుతుంది. చంద్రబాబు నాయుడుపై నమ్మకం ఉన్నప్పటికీ ఆయన ప్రాతినిధ్యం వహించే ప్రాంతంపై పెద్దగా ఆసక్తి లేకపోవడమే ఎక్కువ సంస్థలు ముందుకు రాలేదని చెబుతున్నారు.
ఇది నాంది మాత్రమేనని...
అయితే చంద్రబాబు దావోస్ పర్యటన భవిష్యత్ కు నాంది పలుకుతుందన్న కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు వెంటనే విజయాలు దక్కవని, వాటి ఫలితాలు తర్వాత వెల్లడవుతాయని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు చేతులు ముడుచుకుని కూర్చోలేదు. ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. బిల్ గేట్స్ వంటి ప్రముఖలతో భేటీ అయ్యారు. తమ ప్రాధాన్యతలతను వారికి వివరించారు. వారి అవసరాలను అడిగి తెలుసుకోగలిగారు. రాజధాని అమరావతి పూర్తి కాలేదు. విశాఖపట్నం మరీ దూరంగా ఉండిపోయింది. చంద్రబాబు తన దావోస్ పర్యటనలో పదిహేను పరిశ్రమలకు చెందిన అధిపతులతో సమావేశమై చర్చించారు. వాటి ఫలాలు త్వరలోనే వెల్లడవుతాయని చెబుతున్నారు.
రాజకీయాలు కూడా...
మరోవైపు రాజకీయాలు కూడా ఈ దావోస్ పర్యటనపై పడి ఉంటాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల మాదిరిగా కాకుండా ఏపీ రాజకీయాలకు ఒక ప్రత్యేకత ఉండటమే ఇందుకు కారణం. మరోసారి జగన్ అధికారంలోకి రాలేరన్న హామీ లేకపోవడంతో పాటు ప్రభుత్వం మారితే తమకు ఇబ్బందులు వస్తాయన్న ఆలోచన కూడా పారిశ్రామికవేత్తలు వెనకడుగు వేయడానికి ఒక కారణంగా చూడాలంటున్నారు. రాజకీయ కారణాలతోనే ఎక్కువగా పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదరలేదన్న వాదనలో నిజముందని కూడా అనేక రకాల విశ్లేషణలు వెలువడుతున్నాయి.మొత్తం మీద భవిష్యత్ లో ఏపీకి పెట్టుబుడులు వస్తాయన్న నమ్మకంతోనే చంద్రబాబు టీం దావోస్ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చింది.


Tags:    

Similar News