Chandrababu : చంద్రబాబు వెళుతున్న మార్గం కరెక్టేగా.. కిటుకు తెలిస్తే షాకవుతారంతే?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోవడానికి అనేక కారణాలున్నాయి.

Update: 2025-01-27 07:29 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోవడానికి అనేక కారణాలున్నాయి. ముందు అమరావతి, పోలవరం నిర్మాణం పనులు పూర్తి కావడమే చంద్రబాబు ప్రధాన కర్తవ్యం. ఆంధ్రప్రదేశ్ లో మెజారిటీ ప్రజలు కూడా భావిస్తున్నది ఇదేనని ఆయన అంచనా వేస్తున్నారు. గతంలో జగన్ ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టి కేవలం సంక్షేమానికి పెద్దపీటలు వేసినా, బటన్ నొక్కినా ప్రయోజనం లేకపోయింది. అందుకే బటన్ నొక్కడం కంటే.. డెవలెప్ మెంట్ కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ గత ఏడు నెలల నుంచి చంద్రబాబు వెళుతున్నారు. ప్రజలు కట్టే పన్నుల సొమ్ముతో పాటు, అప్పులు చేసి మరీ సంక్షేమ పథకాలకు ఖర్చు చేయడం వృధా అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

సూపర్ సిక్స్ హామీలు...
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడుకు సూపర్ సిక్స్ హామీలు ఇప్పటికిప్పుడు అమలు చేసినప్పటికీ జరిగే నష్టం ఎంత? వచ్చే ప్రయోజనం ఎంతో బేరీజు వేసుకుంటారు. ప్రజలు సులువుగా ఏ అంశాన్నిఅయినా మర్చిపోతారు. హామీలు ఆలస్యంగా అమలు చేసినంత మాత్రాన ఇప్పటికిప్పుడు ప్రభుత్వానికి వచ్చే నష్టం లేదు. ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి లేదు. అక్కడక్కడా, సోషల్ మీడియాలోనూ, వైసీపీ అనుకూల మీడియాలోనూ విమర్శలు తప్ప ఏవీ తనను ప్రజలకు దూరం చేయలేవన్న భావనలో చంద్రబాబు ఉన్నారు. ఎప్పుడు సంక్షేమ పథకాలను అమలు చేసినా గతాన్ని పూర్తిగా మర్చిపోయే జనాల గురించి చంద్రబాబుకు తెలియంది కాదు. అందుకే సూపర్ సిక్స్ హామీల అమలు కంటే ఆయనకు కంటికి కనిపించే అభివృద్ధి విషయంలోనూ అడుగులు వేస్తున్నారన్నది వాస్తవం.
అమరావతి పూర్తయితే...
ముందుగా రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేస్తే కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలు కూడా రాష్ట్రానికి క్యూ కడతారు. రియల్ ఎస్టేట్ బూమ్ పెరగడంతో పాటు సంపద కూడా పెరిగే అవకాశముంది. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చి పెడుతుంది. రాజధాని అమరావతిలో వాణిజ్యకార్యక్రమాలు కూడా మొదలయ్యాయంటే ఇక దానిని ఆపే శక్తి ఎవరికి ఉండదని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే వచ్చే నెల రెండో వారం నుంచే రాజధాని అమరావతి పనులు ప్రారింభించాలని ఆయన నిర్ణయించారు. పనులు ప్రారంభమయిన నాటినుంచే అమరావతికి నిధుల వరద పారుతుందన్న అంచనాలో చంద్రబాబు ఉన్నారు. ప్రతిష్టాత్మక సంస్థలు కూడా అమరావతికి వచ్చేఅవకాశముందనిచెబుతున్నారు.
ఇప్పటి అనుకూల పరిస్థితులు...
మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయగలిగితే దాని వల్ల ఇంకా ప్రయోజనం రెట్టింపు అవుతుందని భావిస్తున్నారు. పోలవరం డయాఫ్రం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 2027 నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో చంద్రబాబు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడయితే పోలవరానికి అడిగినంత సాయం చేస్తుంది. ఏమాత్రం ఆలస్యమయినా ఎన్నికలు జరిగి.. ఫలితాల్లో తేడా కొడితే కేంద్రంలో అధికారంలోకి వచ్చినా బీజేపీ ఈ రకమైన సాయం అందిస్తుందన్న నమ్మకం లేదు. అందుకే ఈ రెండు అంశాలను చంద్రబాబు ప్రాధాన్యతను తీసుకున్నారు. అవకాశమున్నప్పుడే అన్నీ సరదిద్దుకోవాలన్న భావనలో అమరావతి, పోలవరానికే ఆయన పెద్దపీట వేస్తున్నారు. సంక్షేమ పథకాలు నేడు కాకుంటే కొంత ఆలస్యమయినా జనం అర్థం చేసుకుంటారని చంద్రబాబు గట్టి విశ్వాసం. సో.. సూపర్ సిక్స్ హామీలపై ఆశలు వదుకోవడం మంచిదే. అమలు చేస్తారు కానీ, వెనువెంటనే చేసే ఉద్దేశ్యంలో చంద్రబాబు లేరన్నది ప్రభుత్వ వర్గాల నుంచి అందదుతున్న సమాచారం.


Tags:    

Similar News