Andhra Pradesh : మండలి హాట్ హాట్ గా.. శానససభ సమావేశాలు మాత్రం?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లైవ్ కనిపించడం చాలా తక్కువగా కనిపిస్తుంది. ఎక్కువగా శాసనమండలి సమావేశాలు మాత్రమే ఫోకస్ అవుతున్నాయి

Update: 2025-09-24 07:57 GMT

ఏ రాష్ట్రమైనా శాసనసభ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం దానికి విరుద్ధంగా శాసనమండలి సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమైన చర్చ జరిగే సమయంలో ఎక్కువగా అన్ని న్యూస్ ఛానెళ్లలో లైవ్ ఇస్తాయి. కానీ ఇప్పుడు ఏపీ అసెంబ్లీ లైవ్ కనిపించడం చాలా తక్కువగా కనిపిస్తుంది. ఎక్కువగా శాసనమండలి సమావేశాలు మాత్రమే ఫోకస్ అవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం శాసనసభలో ప్రతిపక్షం లేకపోవడం. శాసనమండలిలో విపక్షం ఉండటమే. అందుకే శాసనమండలిలో చర్చలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరుగుతుంది.

సజావుగానే సాగుతున్నప్పటికీ...
అసెంబ్లీ సమావేశాలు మాత్రం సజావుగానే సాగుతున్నా మామూలుగానే సాగిపోతున్నాయి. అందుకే దానిపై ప్రజల్లోనూ పెద్దగా ఆసక్తి ఉండటం లేదు. గత ఎన్నికల్లో వైసీపీ కేవలం పదకొండు స్థానాల్లో మాత్రమే గెలిచింది. దీంతో తమకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప శాసనసభకు రామని వైసీపీ చెబుతుంది. పది శాతం సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా దక్కుతుందని, పద్దెనిమిది సీట్లు రాకపోవడంతో ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని అధికార పార్టీ అంటోంది. దీంతో వైసీపీ శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి జగన్ తో సహా శాసనసభ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో అసెంబ్లీలో ఉన్నది మూడు పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యులు కూటమి ప్రభుత్వంలోని వారే కావడంతో అర్ధవంతమైన చర్చలు జరుగుతున్నాయి కానీ, ఆసక్తి లేదంటున్నారు.
మండలిలో వైసీపీ vs మంత్రులు...
శాసనమండలిలో మాత్రం వైసీపీ బలంగా ఉంది. అందుకే శాసనమండలి సభ్యులు సమావేశాలకు హాజరవుతున్నారు. అక్కడ వాయిదా తీర్మానాలు ఇవ్వడం నుంచి ప్రజా సమస్యలపై చర్చించేందుకు శాసనమండలి వేదికగా మారింది. శాసనమండలి వైసీపీ పక్ష నేతగా బొత్స సత్యనారాయణ ఉన్నారు. దీంతో పాటు సభ్యులందరూ మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణ, ఫీజు రీ ఎంబర్స్ మెంట్, తల్లికి వందనం వంటి సమస్యలను ప్రస్తావిస్తున్నారు. దీంతో శాసనమండలిలో మంత్రులకు, వైసీపీ సభ్యులకు వాదన రసవత్తరంగా సాగుతోంది. శానససభకు కూడా వైసీపీ వచ్చి కనీసం వాయిదా తీర్మానాలు ఇచ్చి వాటిని తిరస్కరించిన తర్వాత వాకౌట్ చేసి వెళ్లిపోతే మంచిదన్న సూచనలు మేధావుల నుంచి వస్తున్నాయి.


Tags:    

Similar News