Tirumala : తిరుమలకు పోటెత్తిన భక్తులు.. లక్షలాది మంది రావడంతో?

తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఈరోజు రథసప్తమి కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు

Update: 2025-02-04 02:40 GMT

తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఈరోజు రథసప్తమి కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. రెండు లక్షల మందికిపైగానే భక్తులు వస్తారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ముందుగా అంచనా వేసి అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటను దృష్టిలో పెట్టుకుని మరోసారి అలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకున్నారు.

మాడ వీధుల్లో వాహన సేవలు...
రథసప్తమి రోజున మలయప్ప స్వామి మాడ వీధుల్లో తిరుగాడుతారు. వాహనసేవలు ఉంటాయి. వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తొమ్మది రోజుల పాటు పదహారు వాహానాలపై విహరించే స్వామి వారు రథసప్తమి ఒక్కరోజు మాత్రం ఏడు వాహనాలపై మాడవీధుల్లో దర్శనమిస్తారు. ఈ దృశ్యాన్ని తిలకించేందుకు పెద్దయెత్తునభక్తులు తిరుమలకు నిన్నటి నుంచే తరలి వచ్చారు. ఘాట్ రోడ్లలో కూడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి...
భక్తులు ఇబ్బంది పడకుండా నూట ముప్ఫయి గ్యాలరీల్లో ప్రత్యేకంగా ఫుడ్‌ కౌంటర్లను ఏర్పాటు చేశారు. నిరంతరాయంగా ప్రసాదాల పంపిణీ చేశారు. వాహనసేవలను తిలకించేందుకు భారీ ఎల్‌ఈడీలను ఏర్పాటు చేశారు. రథసప్తమి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు వస్తారని భావించి మూడు రోజుల పాటు ఎస్.ఎస్.డి. టోకెన్లు జారీని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నిలిపేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 నుంచి భక్తుల సర్వదర్శనానికి అనుమతించారు. ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్‌ దర్శనాలను కూడా టీటీడీ రద్దు చేసింది. నేడు శ్రీవారి దర్శనానికి ఎక్కువ సమయం పడుతుండటంతో క్యూ లైన్లలో ప్రసాదాలు, మజ్జిగను పంపిణీ చేస్తున్నారు.

18 గంటల సమయం...

తిరుమలలో నేడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 59,784 మందిభక్తులు దర్శించుకున్నారు. వీరిలో 20,470 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.61 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News