లక్ష్మీపార్వతిని మరచిపోతే ఎలా?

టీడీపీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు స్మారకార్ధం

Update: 2023-08-25 03:03 GMT

టీడీపీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు స్మారకార్ధం కేంద్ర ప్రభుత్వం రూ.100 నాణెం విడుదల చేయనుంది. ఈ కార్యక్రమం విషయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఎన్టీఆర్ సతీమణి, తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి లేఖ రాశారు. అతిథుల జాబితాలో తన పేరు కూడా చేర్చాలని కోరారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఇతర కుటుంబ సభ్యులను మాత్రమే పిలవడంపై లక్ష్మీపార్వతి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ భార్యగా తానే అసలైన వారసురాలినని లక్ష్మీపార్వతి లేఖలో పేర్కొన్నారు. ఇదే సమయంలో ఎన్టీ రామారావు పేరుపై రూ.100 నాణెం విడుదల చేస్తున్నందుకు ఆమె కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు తదితర కుటుంబ సభ్యుల వల్ల ఎన్టీఆర్ చనిపోయారని, అలాంటి వ్యక్తులను నాణెం విడుదల కార్యక్రమానికి పిలవడంపై లక్ష్మీపార్వతి ఆవేదన వ్యక్తం చేశారు.

స్వర్గీయ నందమూరి తారక రామారావు గౌరవార్థం ఆయన పేరుపై రూ.100 నాణెం విడుదల కానున్న నేపథ్యంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఈ నెల 28న ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆగస్ట్ 28న ఈ కార్యక్రమం ఉండనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఎన్టీఆర్ పేరిట రూ.100 నాణెం విడుదల కానుంది. ఈ కార్యక్రమం కోసం ఎన్టీఆర్ వారసులు, వారి కుటుంబ సభ్యులను అందరినీ ఆహ్వానించారు. అదే సమయంలో ఎన్టీఆర్‌తో పరిచయం ఉన్న పలువురు ప్రముఖులను సైతం ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానాలు పంపించారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్టీఆర్ నాణెన్ని ముద్రించింది. హైదరాబాదులోని మింట్ కాంపౌండ్‌లోనే ఈ వంద రూపాయల నాణెం ముద్రించడం విశేషం.. 100 రూపాయల నాణెం మీద ముద్రించిన ఎన్టీఆర్ బొమ్మలను ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు స్వయంగా సెలెక్ట్ చేయగలిగే అవకాశం లభించింది. 44 మిల్లీ మీటర్ల చుట్టుకొలతతో ఉండే ఈ వంద రూపాయిల నాణేన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్‌తో తయారు చేసినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఈ రూ. 100 నాణేనికి అన్ని ఇతర నాణేల తరహాలోనే ఒక వైపు మూడు సింహాలతో పాటు అశోక చక్రం చిహ్నం ఉండనుండగా.. ఇంకో వైపు ఎన్టీఆర్ ముఖ చిత్రం ఉన్నాయి. ఎన్టీఆర్ ముఖ చిత్రం కింది భాగంలో నందమూరి తారక రామారావు శతజయంతి 1923- 2023 అని హిందీలో ముద్రించారు. ఆగస్ట్ 28వ తేదీన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఎన్టీఆర్ వంద రూపాయిల నాణాన్ని విడుదల చేయనున్నారు.


Tags:    

Similar News