Kontathala Ramakrishna : ఉత్తరాంధ్ర నేత కొణతాల ఊపు తగ్గినట్లుందే
జనసేన నేత కొణతాల రామకృష్ణ పదవిలో లేనప్పుడు ఉత్తరాంధ్ర సమస్యలపై ఉద్యమించేవారు
జనసేన నేత కొణతాల రామకృష్ణ పదవిలో లేనప్పుడు ఉత్తరాంధ్ర సమస్యలపై ఉద్యమించేవారు. నిత్యం జనం నోళ్లలో నానేవారు. కొణతాల దాదాపు దశాబ్దకాలం పైగానే ఎలాంటి పదవి లేకున్నా నిత్యం జనంలో ఉండేవారు. కానీ ఎమ్మెల్యే అయిన తర్వాత పూర్తిగా మౌనాన్ని ఆశ్రయించారు. కొణతాల రామకృష్ణ కు నిజాయితీపరుడని పేరుంది. ఆయన రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చలేదు. పార్టీలు మారారన్న విమర్శలు తప్పించి ఆయనపై ఎలాంటి కళంకం పడలేదు. ఉత్తరాంధ్రలో సీనియర్, సిన్సియర్ నేతగా కొణతాల రామకృష్ణకు పేరుంది. అలాంటి కొణతాల రామకృష్ణ మొన్నటి ఎన్నికల్లో జనసేన నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మాత్రం పెద్దగా ఉత్తరాంధ్ర సమస్యలపై స్పందించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
నాలుగు దశాబ్దాల నుంచి...
ఉత్తరాంధ్రలో సీనియర్ నేత కొణతాల రామకృష్ణ దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. మచ్చలేని నేతగా గుర్తింపు ఉంది. వివాదాలకు దూరంగా ఉంటారు. కేవలం ఉత్తరాంధ్రకే పరిమితమై ఆ ప్రాంత సమస్యలనే ఎక్కువగా పట్టించుకుంటారు. నాలుగు దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నా ఆయన గెలిచింది మాత్రం మూడు సార్లు మాత్రమే. 1989, 1991 లో కాంగ్రెస్ నుంచి అనకాపల్లి పార్లమెంటుకు పోటీ చేసి విజయం సాధించారు. 2004లో అనకాపల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి మరొకసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. తిరిగి 2024 ఎన్నికల్లో ఆయన మరోసారి అనకాపల్లి నుంచి విజయం సాధించారు. కొణతాల రామకృష్ణ రాజకీయ జీవితంలో గెలుపు కంటే ఓటములే ఎక్కువ.
జనసేనలో చేరిన తర్వాత...
కాంగ్రెస్, వైసీపీలో చేరి బయటకు వచ్చిన కొణతాల రామకృష్ణ జనసేనలో చేరారు. 2023 ఎన్నిలకు ముందు కొణతాల రామకృష్ణ జనసేన పార్టీలో చేరారు. అనకాపల్లి శాసనసభ సీటును సాధించుకున్నారు. మంత్రి పదవి దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురయినా తన పని తాను చేసుకుపోతున్నారు. కొణతాల రామకృష్ణ పూర్తిగా తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. వైఎస్ మంత్రివర్గంలో పనిచేసిన కొణతాల రామకృష్ణ తనకు అదృష్టం మరోసారి వరిస్తుందని భావించినా దక్కలేదు. అయితే కొణతాల రామకృష్ణ మాత్రం ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయనపై ఉన్న నమ్మకం ప్రజల్లో సన్నగిల్లుతుందని అంటున్నారు. ఉత్తరాంధ్రలో పేరుకపోయిన సమస్యలను ప్రస్తావించకుండా కొణతాల రామకృష్ణ తప్పించుకుతిరుగుతున్నారన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మరి కొణతాల రామకృష్ణ ఎందుకు ఇలా మారిపోయారన్నది ఆయన అనుచరులకు కూడా అర్థం కాకుండా ఉంది.