karri Padmsri : పాపం.. ఈ ఎమెల్సీ వైసీపీని వీడి తప్పు చేశారని ఇప్పుడు ఫీలవుతున్నారా?

కాకినాడకు చెందిన ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ వైసీపీ నుంచి టీడీపీలోకి మారినా హ్యాపీగా లేరు

Update: 2025-10-03 06:59 GMT

ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ ఇప్పుడు పార్టీలోకి ఎందుకు చేరానా? అని బాధపడుతున్నారట. వైసీపీ నుంచి టీడీపీలో వచ్చిన నాటి నుంచి నియోజకవర్గంలో తనకు గుర్తింపు లేకపోగా, పార్టీ క్యాడర్ కూడా తనను నేతగా గుర్తించడం లేదని వాపోతున్నారు. కర్రి పద్మశ్రీని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి జగన్ ఇచ్చారు. కాకినాడ పట్టణ ప్రాంతానికి చెందిన కర్రి పద్మశ్రీ మత్స్యకార సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో ఆమె సామాజికవర్గం ఓటర్లు తమకు అనుకూలంగా మారతాయని నాటి వైసీపీ అధినేత జగన్ కర్రి పద్మశ్రీని ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేశారు. అంత వరకూ బాగానే ఉంది. కానీ ఆమె 2024లో జరిగిన ఎన్నికల ఫలితాలు రివర్స్ అయిన వెంటనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.

ఇష్టంలేకున్నా చేర్చుకున్నా...
శాసనమండలిలో బలం పెంచుకునే ప్రయత్నంలో భాగంగా తెలుగుదేశం పార్టీ కొందరు ఎమ్మెల్సీలకు వల వేసింది. దాదాపు పది మంది ఎమ్మెల్సీలు టీడీపీలో చేరేందుకు సిద్ధమై ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. వీరిలో కర్రి పద్మశ్రీ ఒకరు. నిజానికి తన సామాజికవర్గానికి చెందిన కర్రి పద్మశ్రీని టీడీపీలో చేర్చుకోవడంపై కాకినాడ టౌన్ ఎమ్మెల్యే కొండబాబు అభ్యంతరం చెప్పినా కాకినాడ పట్టణ నియోజకవర్గంలో 40 శాతం ఓట్లు మత్స్యకార సామాజికవర్గం ఓట్లు ఉండటంతో టీడీపీ నాయకత్వం కర్రి పద్మశ్రీ చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్థానిక ఎమ్మెల్యే కొండబాబుకు ఇష్టం లేకపోయినా పార్టీ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని పార్టీలోకి చేర్చుకుంది. ఎమ్మెల్సీ రాజీనామాను ఇంకా మండలి ఛైర్మన్ ఆమోదించలేదు.
కార్యక్రమంలో అవమానం...
అయితే కర్రి పద్మశ్రీని ఎమ్మెల్యే కొండబాబు తో పాటు టీడీపీ నేతలు కూడా అసలు తమ పార్టీ నేతగా పరిగణించలేదని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల శ్రీలంకలో కాకినాడకు చెందిన మత్స్యకారులు చిక్కుకుని అక్కడ జైల్లో దాదాపు రెండు నెలలు గడిపారు. అయితే ప్రభుత్వం చేసిన ప్రయత్నాలతో వారిని శ్రీలంక ప్రభుత్వం విడుదల చేసింది. వారు కాకినాడ వచ్చిన సందర్భంగా టీడీపీ నేతలు స్వాగత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కర్రి పద్మశ్రీని అసలు ఎమ్మెల్యే కొండబాబు పట్టించుకోలేదని, పార్టీ నేతలు కూడా ప్రొటోకాల్ పాటించకుండా కార్యక్రమంలో ఒంటరి చేశారని ఆమె బహిరంగంగానే ఆరోపించారు. అందుకే పార్టీ మారి అధికార పార్టీలోకి వచ్చినప్పటికీ కర్రి పద్మశ్రీకి మాత్రం లోకల్ లీడర్స్ వాల్యూ ఇవ్వకపోడంతోఆమె తమ బాధను పార్టీ హైకమాండ్ కు చెప్పుకునేందుకు సిద్ధమయినట్లు సమాచారం.
Tags:    

Similar News