Jogi Ramesh : దుర్గగుడి వద్ద జోగి ప్రమాణం
మాజీ మంత్రి జోగి రమేష్ విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో కుటుంబ సమేతంగా ప్రమాణం చేశారు.
మాజీ మంత్రి జోగి రమేష్ విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో కుటుంబ సమేతంగా ప్రమాణం చేశారు. నకిలీ మద్యం కేసులో తన ప్రమేయం లేదని ఆయన అమ్మవారి ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి జోగి రమేష్ ప్రమాణం చేశారు. ఘాట్ రోడ్డు ఎంట్రెన్స్ వద్ద దీపం వెలిగించి ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని చెప్పారు. తనపై ప్రభుత్వం కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తుందని, నిందితుడు తన పేరును చెప్పినట్లు ఫేక్ ఆధారాలను సృష్టించి తన, తన కుటుంబ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నిస్తుందని జోగి రమేష్ అన్నారు.
లై డిటెక్టర్ పరీక్షైనా...
ప్రభుత్వం వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుందని మాజీ మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. తన మనసును బాధపెట్టడంతో పాటు తన కుటుంబసభ్యులను కూడా అవమానించారని చెప్పారు. తన హృదయాన్ని గాయపర్చిన వారికి మంచి బుద్ధి ప్రసాదించాలనిఆయన కోరుకున్నారు. ఈ సందర్భంగా జోగి రమేష్ తాను ఏ తప్పు చేయలేదని, తిరుపతి వెంకటేశ్వరస్వామి ఆలయంలోనూ, దుర్గగుడి ప్రాంగణంలోనూ తాను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. నకిలీ మద్యం కేసులో లై డిటెక్టర్ పరీక్షతో పాటు నార్కో అనాలిసిస్ టెస్ట్ కు కూడా సిద్ధమని తెలిపారు.