Jogi Ramesh : జోగి రమేష్ అరెస్ట్ వెనక ఇంత ట్విస్ట్ ఉందా?
వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ తో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి.
వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ తో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. నకిలీ మద్యం తయారీ కేసులో జోగి రమేష్ ను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేస్తారని గత కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లండన్ పర్యటనకు బయలుదేరి వెళ్లిన మరుసటి రోజు.. అదీ ఆదివారం జరగడంతో పాటు కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటన ను డైవర్షన్ ను చేసేందుకు జోగి రమేష్ అరెస్ట్ జరిగిందని వైసీపీ నేతలు అంటున్నారు. కానీ ఈ కేసులో ప్రధాన నిందితుడైన జనార్థనరావు ఇచ్చిన వాంగ్మూలం మేరకే జోగి రమేష్ ను అరెస్ట్ చేశారని, ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఎందుకుంటుందని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
టీడీపీ నేతలు ఏమంటున్నారంటే...?
నిజానికి మాజీ మంత్రి జోగి రమేష్ ను రెండు రోజుల క్రితమే ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. అప్పటి నుంచే ఆయన అరెస్ట్ జరిగి తీరుతుందని అందరూ అంచనా వేసుకుంటున్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న జనార్థనరావును విచారించిన సమయంలో తనకు మూడు కోట్ల సాయం చేస్తానని, ఆఫ్రికాలో డిస్టలరీని పెట్టుకోవచ్చని జోగి రమేష్ ఆశపెట్టడం వల్లనే తాను నకిలీ మద్యం తయారీకి ఉపక్రమించానని చెప్పాడు. చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లి నేత జయచంద్రారెడ్డి సహకారం తీసుకుని ములకల చెరువులో నకిలీ మద్యం తయారీని ఏర్పాటు చేసుకోవాలని కూడా తనకు జోగి రమేష్ ససూచించినట్లు పోలీసుల విచారణలో జనార్థనరావు వెల్లడించిన విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.
వైసీపీ నేతల వాదన...
కానీ మూడు కోట్ల రూపాయలు జనార్థన్ రావుకు ఇచ్చి నకిలీ మద్యం తయారు చేయించాల్సిన అవసరం జోగి రమేష్ కు ఎందుకుంటుందని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. జోగి రమేష్ కు, జనార్థనరావుకు సంబంధం లేదని కేవలం రాజకీయ కక్షతోనే జోగి రమేష్ పై ప్రభుత్వం ఈ అక్రమ కేసు బనాయించిందన్నది వైసీపీ నేతల ప్రధాన ఆరోపణ. నాడు చంద్రబాబు నివాసం పై దాడికి వెళ్లినందుకు కక్ష కట్టి జోగి పై ఈ కేసును బనాయించారని వైసీపీ నేతలు తమ సోషల్ మీడియాలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. జోగి రమేష్ కూడా కొన్ని రోజుల నుంచి తనను ఈ కేసులో అరెస్ట్ చేస్తారని తెలిసి, ఈ కేసుతో తనకు ఏ సంబంధం లేదని కుటుంబ సభ్యులతో కలసి వచ్చిన కనకదుర్గ గుడిలోనూ ప్రమాణం చేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. మొత్తం మీద జోగి రమేష్ అరెస్ట్ తో రాజకీయ రగడ మాత్రం మొదలయింది.