VV Lakshmi Narayana : జేడీ చేరే పార్టీ అదేనా? అందుకే ఆగారా?
వి.వి. లక్ష్మీనారాయణ రాజకీయ పార్టీ పెట్టారు
వి.వి. లక్ష్మీనారాయణ రాజకీయ పార్టీ పెట్టారు. జై భారత్ నేషనల్ పార్టీని పెట్టిన లక్ష్మీనారాయణ ప్రస్తుతం జనం సమస్యలకు దూరంగా ఉంటున్నారు. ఆయన గతకొంతకాలంగా రాజకీయ కార్యక్రమాల్లోనూ పెద్దగా పాల్గొనడం లేదు. సొంత పార్టీ పెట్టిన లక్ష్మీనారాయణ ఏపీలో ఏదైనా రాజకీయ పార్టీలో చేరే అవకాశముందా? అన్న చర్చ కూడా జరుగుతుంది. అయితే ఆయన మాత్రం బయటపడటం లేదు కానీ, లక్ష్మీనారాయణకు మాత్రం పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక కావాలని బలంగా ఉంది. విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికై లోక్ సభలో అడుగుపెట్టాలని భావించినప్పటికీ రెండుసార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. మరి వచ్చే ఎన్నికలకు ఎలాంటి వ్యూహంతో వెళ్లనున్నారన్నది హాట్ టాపిక్ గా మారింది.
సౌమ్యుడిగా..
జేడీ లక్ష్మీనారాయణగా దక్షిణాది రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన 1990 నాటి ఐపీఎస్ అధికారి అసలు పేరు వీవీ లక్ష్మీనారా యణ. సీబీఐలో జాయింట్ డైరెక్టర్ గా పనిచేయడంతో ఆయన పేరు జేడీ లక్ష్మీనారాయణగా స్థిరపడిపోయింది. దాదాపు ఏడేళ్ల సర్వీసు ఉండగానే ఉద్యోగానికి స్వచ్ఛంద రాజీనామా ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సౌమ్యుడిగా, విజ్ఞాన వంతుడిగా ఆయనకు ఎంతో పేరుంది. మృదు స్వభావిగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు. వృత్తి రీత్యా ఐపీఎస్ అయినప్పటికీ.. ఆయనలో ఎక్కడా కఠినత్వం జాడలు కూడా మనకు కనిపించవు. ముఖ్యంగా విద్యా విషయాలు, విద్యార్థులకు దిశానిర్దేశం చేయడం వంటి అంశాల్లో జేడీది అందె వేసిన చేయి. వివేకానందుని బోధనలు, దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలా భావనలను జేడీ ఎంతో నమ్మడమే కాకుండా వాటిని ప్రచారం కూడా చేస్తారు. ఇక, ఇప్పుడు ఆయన రాజకీయ నిర్ణయంపై అందరిలోనూ ఆసక్తి ఉంది.
ఐపీఎస్ అధికారిగా...
మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన యావత్‌మల్ సబ్‌డివిజన్ ఏఎస్పీగా మూడేళ్లు, నాందేడ్ ఎస్పీగా మూడేళ్ళు పనిచేశారు. పుణేలోని సాయుధ పోలీసు బెటాలియన్ కమాండెంట్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిం చారు. డీఐజీగా పదోన్నతి పొందిన తర్వాత కేంద్ర సర్వీసులకు వెళ్లి సీబీఐలో బాధ్యతలు స్వీకరించి హైదరాబాద్ విభాగానికి బదిలీ అయ్యారు. హైదరాబాద్‌లోని సీబీఐ విభాగానికి 2006 నుంచి ఏడేళ్లపాటు నేతృత్వం వహించారు. ఇక్కడ ఉన్నప్పుడు లక్ష్మీనారాయణ ఐజీగా పదోన్నతి పొందారు. ఏడేళ్లలో అక్రమాస్తుల కేసులో జగన్‌తోపాటు ఐఏఎస్ అధికారులు, మంత్రులను అరెస్టు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సత్యం కంప్యూటర్ కుంభకోణమూ ఆయన నేతృత్వంలోనే దర్యాప్తు సాగింది. ఓబులాపురం మైనింగ్ కుంభకోణంలో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డిని అరెస్టు చేశారు.
విశాఖ పార్లమెంటు నుంచి...
అయితే లక్ష్మీనారాయణ 2019 ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు. విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2029 ఎన్నికల నాటికి తన సొంత పార్టీ కాకుండా ఆయన ఏదైనా పార్టీలో చేరి విశాఖపట్నం నుంచి విజయం సాధించాలని కోరుకుంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరిస్తారన్న సమయంలోకూ స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా నిలిచారు. అవసరమైతే తాను టెండర్లలో పాల్గొంటానని చెప్పారు. అలాంటి లక్ష్మీనారాయణ ఇటీవల కాలంలో విశాఖలోనూ పర్యటించడం చాలా అరుదుగానే జరుగుతుంది. ఆయన వచ్చే ఎన్నికల నాటికి మాత్రం ఏదో ఒక పార్టీలో చేరి విశాఖపార్లమెంటు నుంచి పోటీ చేయడం ఖాయమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఏ పార్టీ అన్నది మాత్రం త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది.