Jc Prabhakar Reddy : జేసీ వ్యాఖ్యలు దేనికి సంకేతం? గ్రౌండ్ లెవెల్ పల్స్ అర్థమయ్యాయ్యా?
జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక సమావేశంలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో చాలా తీవ్రమైన పోటీ ఎదుర్కొనాల్సి ఉంటుందని అన్నారు
జేసీ ప్రభాకర్ రెడ్డి సీనియర్ నేత. ఆయన ప్రతి మాట ఆవేశంతో మాట్లాడినప్పటికీ అందులో ఏదో ఒక అర్థం ఉంటుందంటారు. అలాంటి జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు కూటమి పార్టీల్లో కొంత ఆలోచనలో పడేశాయి. ఇంకా కూటమి ప్రభుత్వం ఏర్పాటయి ఏడాది కాకముందే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలా అనేశారంటి? అన్న కామెంట్స్ మొదలయ్యాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు అద్దం పడుతున్నాయని కొందరు అంటుంటే.. ఏడాదిలోనే ఆయన అలా ఎలా చెప్పేస్తారంటూ మరికొందరు జేసీ వ్యాఖ్యలను కొట్టిపారేస్తున్నారు. జేసీ ఏ సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేశారో తమకు తెలియదని అప్పటికే జనం పల్స్ ఎలా తెలుస్తుందని ప్రశ్నిస్తున్నారు.
తీవ్రమైన పోటీ...
జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక సమావేశంలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో చాలా తీవ్రమైన పోటీ ఎదుర్కొనాల్సి ఉంటుందని అన్నారు. అయితే ఆయన ఒక్క తాడిపత్రి నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ వ్యాఖ్యలు చేయలేదట. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితిపై ఆయన తెలుసుకుని అలా మాట్లాడారని కొందరు టీడీపీ నేతలే చెబుతున్నారు. ప్రజల్లో కూటమి ప్రభుత్వం పట్ల ఎన్నికలకు ముందున్న సానుకూలత ఇప్పుడు లేదని అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో కూటమికి 164 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. వైసీపీ కేవలం రాష్ట్రంలో పదకొండు ఎమ్మెల్యే స్థానాలకే పరిమితమయింది. అయితే ఈసారి గట్టి పోటీ ఉంటుందని చెప్పడం అంటే జేసీ క్యాలిక్యులేషన్ ఏంటి అన్న దానిపై కూటమి పార్టీల్లో చర్చ జరుగుతుంది.
వరసగా క్యాలెండర్ తో...
కూటమి ప్రభుత్వం ఏడాది గడుస్తుంది. జూన్ 12వ తేదీ నాటికి ఏడాది పూర్తవుతుంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం పింఛను నాలుగువేల రూపాయలకు పెంచింది. మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించింది. మిగిలిన హామీలను అమలుపర్చడానికి వరసగా జూన్ పన్నెండోతేదీ నుంచి క్యాలెండర్ విడుదల చేస్తామని, నెలకు ఒక హామీని అమలు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. వచ్చే నెలలో రెండు ప్రతిష్టాత్మకమైన అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు పదిహేనో తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొదలవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవలే బహిరంగంగా ప్రకటించారు. డేట్ కూడా చెప్పారు కాబట్టి ఇది ఖచ్చితంగా నాడు అమలు చేయాల్సిందే.
నాలుగేళ్ల సమయం ఉన్నా...
ఈ సమయంలో మరో నాలుగేళ్ల పాలన ఉన్న సమయంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేయడం అంటే కూటమి ప్రభుత్వ తీరును తప్పుపట్టడమేనని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏడాది లో హామీలో అమలు పర్చలేదని కొంత అసంతృప్తి ఉన్నా, అవి అమలయ్యాక పరిస్థితుల్లో మార్పు వస్తుందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. మరొక వైపు కూటమి నేతల మధ్య కీచులాటలు, తలెత్తిన విభేదాలు, టీడీపీలో నెలకొన్న ఆధిపత్య పోరు వంటి అంశాలను చూసి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలా వ్యాఖ్యానించి ఉంటారని మరికొందరు అంటున్నారు. మొత్తం మీద జేసీ ప్రభాకర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ కష్టంగా ఉందని చెప్పి కూటమి పార్టీలను ఇరకాటంలో పడేసినట్లేనని పలువురు కామెంట్ చేస్తున్నారు.