Jc Prabhakar Reddy : జేసీని కంట్రోల్ చేయడం ఎలా? ఇలా గయితే కష్టమేనా?

తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పార్టీకి ఇబ్బందిగా మారారు.

Update: 2025-10-31 07:54 GMT

తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పార్టీకి ఇబ్బందిగా మారారు. ఆయనపై అనంతపురం జిల్లా నేతలు కూడా చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. జేసీ ప్రభాకర్ రెడ్డి తీరు వల్ల జిల్లాలో పార్టీకి రాజకీయంగా ఇబ్బందిగా మారుతుందని చెప్పినట్లు సమాచారం. ఆయన తాడిపత్రి నియోజకవర్గంలోనే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ ఆ ప్రభావం జిల్లా పార్టీపై కూడా పడే అవకాశముందని చంద్రబాబు దృష్టికి కొందరు నేతలు తీసుకు వచ్చారు. ఆయనను కట్టడి చేయకుంటే... నోటికి తాళం వేయకుంటే పార్టీ జిల్లాల్లో ఇబ్బందులు పడుతుందని తెలిపారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇతర నియోజకవర్గాల్లోనూ తలదూరుస్తున్నారని, ఒంగోలు కు వెళ్లి అక్కడ కూడా వివాదానికి కారణమయ్యారని చంద్రబాబు దృష్టికి కొందరు నేతలు తీసుకెళ్లినట్లు తెలిసింది.

అస్మిత్ రెడ్డిని పిలిచి...
దీంతో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డిని పిలిచి త్వరలోనే ఆయనకు తగిన సూచనలు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి చేస్తున్న విషయాన్ని జిల్లా నేతలు కూడా పెద్దగా పట్టించుకోలేదు. తాడిపత్రి నియోజకవర్గంలోకి ఆయనను అడ్డుకోవడంతో పాటు పలు మార్లు ఆయనపై విమర్శలు చేసినా అది రెండు కుటుంబాల మధ్య జరుగుతున్న వైరంగానే భావించారు. కానీ ఆయన ఇటీవల ఐపీఎస్ అధికారి, ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై చేసిన వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. దీనివల్ల టీడీపీ పై సాధారణ ప్రజల్లో ఒకరకమైన వ్యతిరకేత భావం ఏర్పడుతుందని చంద్రబాబు కు నేతలు చెప్పినట్లు తెలిసింది.
ప్రభుత్వ నిర్ణయంతో...
అయితే జేసీ ప్రభాకర్ రెడ్డిని కట్టడిని నేరుగా చేయాలంటే కష్టమేనని భావించిన చంద్రబాబు ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డిని పిలిచి క్లాస్ పీకాలని భావిస్తున్నారు. బహుశ లండన్ పర్యటన నుంచి రాగానే అస్మిత్ రెడ్డిని తన వద్దకు పిలిపించుకుని మాట్లాడాలని చంద్రబాబు భావిస్తున్నారు. మరొకవైపు రోహిత్ కుమార్ చౌదరిని బదిలీ చేయాలని కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. కానీ రోహిత్ చౌదరి పదవీకాలాన్ని మరో ఏడాది ప్రభుత్వం పొడిగించడం వెనక కూడా జేసీ నోటికి కళ్లెం వేయడానికేనని అంటున్నారు. మరో ఏడాదిపాటు తాడిపత్రి ఏఎస్పీగా కొనసాగేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ఎస్పీ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డికి అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం వెనక ఆయనకు కూడా ప్రభుత్వ పెద్దల నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చినట్లేనన్నది తాడిపత్రిలో వినిపిస్తున్న టాక్.


Tags:    

Similar News