Janasena Party : జనంలో జనసేన ఎలా ఉంది? కూటమి సర్కార్ పై అంచనాలెలా ఉన్నాయి?
జనసేన మూడు రోజుల పండగకు సిద్ధమయింది. విశాఖ నగరం ఇందుకు వేదిక అయింది.
జనసేన మూడు రోజుల పండగకు సిద్ధమయింది. విశాఖ నగరం ఇందుకు వేదిక అయింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడు రోజుల పాటు విశాఖ నగరంలోనే ఉండనున్నారు. జనసేన హండ్రెడ్ పర్సెంట్ స్ట్రయిక్ రేట్ సాధించిన తర్వాత తొలిసారి ఇంత భారీ స్థాయిలో సమావేశాలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటయి ఏడాది కాలం పూర్తి కావడంతో పాటు పార్టీ శ్రేణులు, నేతల్లో నెలకొన్న నైరాశ్యం పారదోలేందుకు పవన్ కల్యాణ్ ఈ సమావేశాల నుంచి ప్రయత్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ శ్రేణులు ఈ సమావేశం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్ కల్యాణ్ ఈ సమావేశాల నుంచి ఏం సందిస్తారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
ఫీల్డ్ లెవెల్ లో...
ఫీల్డ్ లెవెల్ లో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని పవన్ కల్యాణ్ పార్టీ శ్రేణులను అడిగి తెలుసుకునే ప్రయత్నం పవన్ కల్యాణ్ చేయనున్నారు. ఇప్పటికే అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడంతో వాటి ప్రభావం ఎంత మేరకు ప్రజల్లో ఉందన్న అంచనాలకు కూడా ఈ సమావేశం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. పార్టీ అంతర్గత విషయాలపై కూడా పవన్ కల్యాణ్ పార్టీ నేతలలో చర్చించనున్నారు. ఇందులో ప్రధానంగా నియోజకవర్గాల్లో కూటమి పార్టీల నేతల మధ్య సఖ్యత, సమన్వయం, సహకారం గురించి అడిగి తెలుసుకోనున్నారు. పదవుల విషయాన్ని పక్కన పెడితే అధికారుల తీరు గురించి కూడా ఆరా తీయనున్నారు.
పార్లమెంటు నియోజకవర్గాలవారీగా...
రేపు పార్లమెంటు నియోజకవర్గానికి పది మంది చొప్పున ముఖ్య నేతలతో కూడా పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు. ముఖాముఖి నిర్వహించే ఈ కార్యక్రమంలో 25 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి నేతలు పాల్గొంటారు. వారితో నియోజకవర్గాల్లో కూటమి పరిస్థితితో పాటు విపక్ష వైసీపీపై ఎలాంటి అభిప్రాయం ఉందన్న విషయాన్ని కూడా పవన్ కల్యాణ్ తెలుసుకోనున్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతం చేయడానికి అవసరమైన సలహాలు, సూచనలు కూడా తీసుకుంటారు. అలాగే పార్టీ ఎమ్మెల్యేలతో జరిగే సమావేశాల్లో గత ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీలు పెండింగ్ లో ఉన్నవాటిపై కూడా పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేలతో చర్చించనున్నారు. ప్రధానమైన హామీల పరిష్కారానికి అవసరమైన నిధులు విడుదల చేయడానికి ఆయన ఈ సమావేశం ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలుపు దిశగా పయనింప చేయడానికి పవన్ కల్యాణ్ ఈ ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది.