Andhra Pradesh : కల్తీ మద్యం కేసులో జనార్థన్ రావు జోగి రమేష్ పేరు చెప్పారా?
ఆంధ్రప్రదేశ్ లో కల్తీ మద్యం కేసులో ప్రభుత్వం స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది
ఆంధ్రప్రదేశ్ లో కల్తీ మద్యం కేసులో ప్రభుత్వం స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్ర దర్యాప్తు కోసం నలుగురు అధికారులతో సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్ ఏలూరు ఐజీ అశోక్ కుమార్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే రాహుల్ దేవ్ శర్మతో పాటు మల్లికా గార్గ్, చక్రవర్తితో పాటు ఎక్సైజ్ శాఖలో మరొకరు ఈ సిట్ లో సభ్యులుగా ఉంటారని నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలో నేడు ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. మరొకవైపు ఇప్పటికే ములకలచెరువు మద్యం కల్తీ మద్యం కేసులో జనార్థన్ రావు సంచలన విషయాలు వెల్లడించినట్లు అధికారిక వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. జనార్థన్ రావు వీడియో ఒకటి బయటకు రావడంతో సంచలనంగా మారింది.
జోగి రమేష్ ప్రమేయంతోనే...
ఇప్పటికే ములకలచెరువు మద్యం కల్తీ మద్యం కేసులో ఇరవై ముగ్గురు నిందితులున్నట్లు గుర్తించామని, అందులో పన్నెండు మందిని అరెస్ట్ ఎక్సైజ్ అధికారులు తెలిపారు. దీంతో పాటు లోతుగా వెళ్లి దర్యాప్తు చేసి అసలు విషయాలను వెల్లడించాడానికి ఈ సిట్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తాజాగా జనార్థన్ రావు మాత్రం విచారణలో జనార్థన్ రావు సంచలన విషయాలు బయటపెట్టారని తెలిసింది. మాజీ మంత్రి జోగి రమేష్ ప్రోద్బలంతోనే తాను నకిలీ మద్యం తయారు చేశానని, టీడీపీ అధికారంలోకి రాగానే ఆపానని జనార్థన్ రావు విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. తనకు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జోగి రమేష్ ఫోన్ చేసి నకిలీ మద్యాన్ని తయారు చేయాలని కోరినట్లు జనార్థన్ ఎక్సైజ్ అధికారుల విచారణలో తెలిపినట్లు సమాచారం.