Janasena : పవన్ రోడ్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నారా? ఇక క్యాడర్ కు పండగేనా?
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వేగం పెంచుతున్నట్లు కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం
జనసేన పార్టీ అధినేత ఇక వేగం పెంచుతున్నట్లు కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ఇప్పటి వరకూ ఒక లెక్క. ఈ నాలుగేళ్లు మరొక లెక్క. జమిలి ఎన్నికలు జరిగితే ముందుగానే ఎన్నికలు వస్తాయి. మరోసారి అధికారంలోకి రావాలన్న కసితో పవన్ కల్యాణ్ ఉన్నారు. ఏడాది కాలంగా తన మంత్రిత్వ శాఖకే పరిమిమతమవుతూ దానిపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. పెద్దగా పార్టీని కూడా పట్టించుకోలేదు. అదే సమయంలో కాపు సామాజికవర్గానికి కూడా తాను ఎటువంటి ప్రయోజనం అధికారంలోకి వచ్చిన తర్వాత చేయలేదు. కేవలం తన మంత్రిత్వ శాఖను అర్థం చేసుకునేందుకే ఇంత సమయం పవన్ కల్యాణ్ తీసుకున్నారని చెబుతున్నారు.
మంత్రిత్వ శాఖపైనే...
తొలిసారి మంత్రిగా బాధ్యతలను చేపట్డడం అందులో ఫెయిల్ కాకూడదన్న భావనతోనే పవన్ జనానికి, క్యాడర్ కు దూరంగా ఉన్నారంటున్నారు. ఇక హనీమూన్ పీరియడ్ ముగియడంతో పాటు పవన్ పనితీరుపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. జనసేన నేతలు కూడా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. తాము అప్పుల పాలయ్యామని, తమకు కనీసం పదవులు కూడా దక్కడం లేదని, కనీసం తమకు కూటమి పార్టీల్లో గౌరవం కూడా సరిగా దక్కడం లేదన్న అసంతృప్తితో ఉన్నారు. అందుకే పవన్ కల్యాణ్ పై గతంలో విమర్శలు చేస్తే వెంటనే సోషల్ మీడియా ద్వారానో, మీడియా సమావేశాలు పెట్టి ఖండించే వారు. కానీ గత కొద్ది రోజులుగా మాత్రం మౌనంగా ఉంటున్నారు.
అసలుకే ఎసరు అని...
ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే నాలుగేళ్లలో పార్టీ బలోపేతం మాట దేవుడెరుగు? అసలు కే ఎసరు వస్తుందని భావించి పవన్ కల్యాణ్ ఇక నియోజకవర్గాల వారీగా ముఖ్య నేతలతో సమావేశమవ్వడానికి నిర్ణయించుకున్నారు. నియోజకవర్గాల్లో పరిస్థితులను అడిగి తెలుసుకోవడం మాత్రమే కాకుండా వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లాలని కూడా పవన్ కల్యాణ్ డిసైడ్ అయినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అదే సమయంలో కూటమి పార్టీలో కేర్ చేయని నియోజకవర్గాలను గుర్తించి అక్కడ పర్యటించేందుకు కూడా ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. తద్వారా అక్కడి నేతల్లో జోష్ నింపడమే కాకుండా తెలుగుదేశం పార్టీ నేతలకు కూడా పరోక్ష హెచ్చరికలు జారీ చేయవచ్చని భావిస్తున్నారు.
ఈ ప్రతిపాదనలతో...
దీంతోపాటు మరో ప్రతిపాదనను కూడా చంద్రబాబు నాయుడు ముందు పవన్ కల్యాణ్ పెట్టే అవకాశముందని తెలిసింది. వరసగా అనేక నియోజకవర్గాల నుంచివస్తున్న ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని ప్రతి మూడు నెలలకు ఒకసారి కూటమి పార్టీల అగ్రనేతల ఉమ్మడి సమావేశం నిర్వహించాలని కూడా చంద్రబాబును కోరనున్నట్లు తెలిసింది. కనీసం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కూడా జనసేన నేతలను కొందరు టీడీపీ నేతలు అడ్డుకుంటుండటంతో అటువంటి విషయాలను కూడా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి వాటిని వెంటనే పరిష్కరించాలని, అవసరమైతే ఆ నియోజకవర్గాల నేతలను పిలిపించి మాట్లాడాలని కూడా పవన్ కల్యాణ్ డిసైడ్ అయినట్లు తెలిసింది. మొత్తం మీద పవన్ కల్యాణ్ తన రూటు మార్చి వెళ్లేందుకు రోడ్డు మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారట.