Janasena : జనసేన సభకు వచ్చే వారికి నోరూరించే నాన్ వెజ్ వంటకాలు సిద్ధం
జనసేన ఆవిర్భావ సభ నేడు జరగనుంది. పిఠాపురం నియోజవకర్గంలోని చింతాడ గ్రామంలోని యాభై ఎకరాల్లో ఈ సభను నిర్వహిస్తున్నారు
జనసేన ఆవిర్భావ సభ నేడు జరగనుంది. పిఠాపురం నియోజవకర్గంలోని చింతాడ గ్రామంలోని యాభై ఎకరాల్లో ఈ సభను నిర్వహిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఆవిర్భావ వేడుకలు కావడంతో ఆర్భాటంగా జరపాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఈ మేరకు సభకు జయకేతనం సభ అని నామకరణం చేశారు. అంతేకాదు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఐదు నుంచి ఆరు లక్షల మంది హాజరయ్యే ఈ సభ వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పార్టీ కోసం కష్టపడి పనిచేసి అధికారంలోకి రావడానికి కారణమైన కార్యకర్తలకు మంచి భోజనం అందించడానికి సిద్ధమయ్యారు.
వెజ్.. నాన్ వెజ్ ప్రియులకు...
వెజ్, నాన్ వెజ్ వంటలను తయారు చేస్తున్నారు గోదావరి వంటకాలను జనసైనికులకు రుచి చూపించాలని నాయకత్వం భావించింది. ఎండాకాలం కావడంతో తొలుత వెజిటేరియన్ భోజనం అందించాలని భావించినా తర్వాత చివరకు నాన్ వెజ్ ప్రియులకు కూడా పార్టీ పండగ నాడు కడుపునిండా భోంచేసేలా ఏర్పాట్లు చేయడానికి సర్వం సిద్ధమయింది. గోదావరి జిల్లాల నుంచి ప్రత్యేకంగా ఇందుకోసం వంట చేసేవారిని రప్పించారు. నిపుణులైన వారిని తీసుకు వచ్చి నాన్ వెజ్ వంటకాలను తయారు చేస్తున్నారు.
తృప్తిగా భోజనం చేసేలా...
సభకు వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త తృప్తిగా భుజించేలా చర్యలు తీసుకుంటున్నారు. చేపల పులుసు, రొయ్యల ఇగురు, పీతల పులుసు, కోడి వేపుడు, మటన్ బిర్యానీ వంటి వంటకాలతో పాటు స్టార్టర్స్ కూడా ఫుడ్ స్టాల్స్ లో అందించనున్నారు. ఇక శాఖాహార ప్రియులకు మంచి భోజనం అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. రోటి పచ్చడి, ఆవకాయ, అప్పడం, పప్పు, కూర, సాంబారు, రసం, మజ్జిగ చారుతో పాటు గడ్డ పెరుగును కూడా కార్యకర్తలకు అందించనున్నారు. అందరికీ మంచినీరు, మజ్జిగ నిరంతరంగా అందచేస్తారు. అలాగే మధ్యాహ్నంతో పాటు రాత్రి తిరిగి తమ ప్రాంతాలకు వెళ్లేవారికి రహదారులలో భోజనాలను అందించే ఏర్పాట్లను కూడా చేస్తున్నారు.