Ys Jagan : జగన్ కు నమ్మకమైన నేత ఎవరు? ఇలా అయితే ఆమె ఎంట్రీ తప్పదా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రస్తుతం కొంత గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు

Update: 2026-01-02 08:08 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రస్తుతం కొంత గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమిని తట్టుకుని నిలబడాలంటే తనకు అత్యంత నమ్మకమైన నేతలు చుట్టూ ఉండాలని కోరుకుంటున్నారు. కానీ కనుచూపు మేరలో నమ్మకమైన నేతలు ఎవరూ కనిపించకపోవడంతో ఒకింత ఆందోళనలో ఉన్నట్లు కనిపిస్తుంది. సహజంగా సజ్జల రామకృష్ణారెడ్డి నమ్మకమైన నేతగానే భావిస్తారు. కానీ పూర్తి స్థాయిలో జగన్ సజ్జలకు బాధ్యతలను అప్పగించడం కూడా ఇష్టంలేదంటున్నారు. కేవలం కొన్నింటికి మాత్రమే సజ్జల రామకృష్ణారెడ్డిని పరిమితం చేస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో తనకు అన్ని రకాలుగా సహకరించే నేతలు ఎవరన్నది జగన్ కు అర్థం కాకుండా ఉంది. కొందరిని తన చుట్టూ పెట్టుకున్నా వారిని కోటరీ కింద జమకట్టి విమర్శలు చేస్తున్నారు.

గతంలో వైవీసు బ్బారెడ్డి కూడా...
గతంలో ఢిల్లీలో విజయసాయిరెడ్డి కొంత అండగా ఉండేవారు. ఢిల్లీ స్థాయిలో కొంత తనకు అనుకూలంగా పరిస్థితులను మలిచి పెట్టేవారు. పార్టీ నుంచి విజయసాయిరెడ్డి వెళ్లిపోవడంతో తనకు సమీప బంధువు, బాబాయి అయిన వైవీ సుబ్బారెడ్డిని ఢిల్లీకి పంపారు. మరొకవైపు వైవీ తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఇబ్బందులు పడుతుననారు. ఇక్కడ రాజకీయాలను చక్కబెట్టేవారు లేరు. శాసనమండలి పార్టీ నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ సీనియర్ నేతగా ఉన్నప్పటికీ ఆయనకు పూర్తి స్థాయిలో బాధ్యతలను అప్పగించలేని పరిస్థితి. ఇక పార్టీలో ఎవరనీ దగ్గరకు తీసుకోలేని పరిస్థితి. తాను బెంగళూరులో ఉన్నప్పటికీ ఇక్కడ పార్టీ కార్యక్రమాలను చక్కదిద్దే నాయకుడు లేక రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
విజయమ్మ, షర్మిల రాజకీయంగా...
మరొకవైపు వచ్చే ఎన్నికలకు ముందు తాను రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రచేయాలని నిర్ణయించుకున్నారు. పాదయాత్ర చేపట్టాలంటే దాదాపు ఏడాది పాటు తాడేపల్లి పార్టీ కార్యాలయానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో పార్టీ పనులను చక్కబెట్టేవారు లేక జగన్ సతమతమవుతున్నట్లు తెలిసింది. 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో జగన్ కు వైఎస్ విజయమ్మ, షర్మిల ఇద్దరూ ఉండటంతో ధీమాతో ఆయన పాదయాత్ర చేపట్టారు. ఈసారి వారిద్దరూ కూడా తనకు రాజకీయంగా దూరం కావడంతో తన సతీమణి భారతిని రాజకీయాల్లోకి తీసుకు రావాలా? లేదా? అన్న మీమాంసలో జగన్ ఉన్నట్లు తెలిసింది. అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలోనే భారతి రాజకీయంగా ముఖ్యపాత్ర పోషించే అవకాశాలు లేకపోలేదని పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించడంతో పార్టీలో జగన్ కు నమ్మకమైన నేతలు ఎవరూ లేరని అర్థమవుతుంది.


Tags:    

Similar News