Ys Jagan : జగన్ ఇమేజ్ మసక బారిందా? రెడ్లు కూడా నమ్మడం లేదా?

వైసీపీ అధినేత జగన్ చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

Update: 2025-12-16 07:10 GMT

వైసీపీ అధినేత జగన్ చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. జగన్ కు గతంలో ఉన్న ఇమేజ్ ఇప్పుడు అంతగా లేదు. ఎందుకంటే 2011లో పార్టీ పెట్టినప్పటి నాటి నుంచి 2019 వరకూ విపరీతమైన క్రేజ్ ఉండేది. జగన్ పై అనేక అవినీతి ఆరోపణలు... లక్ష కోట్ల రూపాయలంటూ టీడీపీ చేసిన విమర్శలను కూడా జనం పెద్దగా పట్టించుకోలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా మాత్రమే కాకుండా జగన్ కు ప్రత్యేక ఇమేజ్ ఏర్పడింది. జనంలోనూ, ప్రత్యేకంగా క్యాడర్ లోనూ జగన్ అంటే ఒక భరోసా ఏర్పడింది. జగన్ ను నమ్మితే ఖచ్చితంగా తమ రాజకీయ జీవితం బాగుపడుతుందని అనేక మంది భావించారు. 2014లో ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయినా జగన్ పార్టీ నుంచి వెళ్లిన నేతలు దాదాపుగా అందరూ తర్వాత ఎన్నికల్లో ఓటమి పాలు కావడానికి ఇదే కారణం.

ఐదేళ్ల అధికారంలో...
కానీ 2019 నుంచి 2024 వరకూ జగన్ చేసిన పాలనను చూసిన తర్వాత సామాన్య, పేద ప్రజలను పక్కన పెడితే ఆయనకున్న ఇమేజ్ కు చెదలు పట్టిందనేచెప్పాలి. ఎందుకంటే గతంలో మాదిరిగా జగన్ ను నమ్ముకున్న క్యాడర్ ను పక్కనపెట్టడమే ఇందుకు కారణం. నేతలు కూడా విసిగిపోయి ఉన్నారు. జగన్ కేవలం సామాజికవర్గాలుగా ఓటర్లను చీల్చి లబ్దిపొందాలని ప్రయత్నించారని సొంత సామాజికవర్గమైన రెడ్డి సామాజికవర్గంలోనూ ఈ అభిప్రాయం బలంగా పడింది. 2019 ఎన్నికల్లో తమ సొంత డబ్బులను ఖర్చు పెట్టి జగన్ ను ముఖ్యమంత్రిగా చేయాలని కసితో పనిచేసిన వారు కూడా తర్వాత కాలంలో సామాజిక సమీకరణాల పేరుతో, సంక్షేమం పేరుతో తమకు గండికొట్టాడన్న అభిప్రాయం రెడ్డి వర్గం నేతల నుంచే ఎక్కువగా వినిపిస్తుంది.
భరోసా ఇస్తే తప్ప...
ఇప్పుడు అది తొలగించుకోవడానికి జగన్ విశ్వప్రయత్నం చేస్తున్నారు. జగన్ 2.Oలో క్యాడర్ కు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్నప్పటికీ పెద్దగా స్పందన లేదు. చాలా మంది నేతలు ఇప్పటికే పార్టీని వీడుతుండటం ఇదే కారణం. స్థానిక రాజకీయ నేతలకు కూడా జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది క్లారిటీ లేదు. అందుకే నియోజకవర్గాల్లో క్యాడర్ ను కూడా వారు పెద్దగా పట్టించుకోవడం లేదు. అదే జగన్ కు రానున్న కాలంలో ఇబ్బందిగా మారిందన్నది విశ్లేషకుల అంచనా. ఇప్పటికైనా జగన్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్న సూచనలు వెలువడుతున్నాయి. క్యాడర్ తో పాటు లీడర్లకు కూడా వచ్చే ఎన్నికల్లో సీటు భరోసా ఇస్తే తప్ప వారిలో నమ్మకం కలిగేలా కనిపించడం లేదు. జగన్ ఇమేజ్ మసకబారిందనడానికి ఇటీవల కాలంలో వరసగా పార్టీ నుంచి వెళుతున్నవారే. కానీ జగన్ వాటిని చిన్న విషయంగా పట్టించుకుంటే .. భవిష్యత్ లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.






Tags:    

Similar News