Ys Jagan : జగన్ కు, నేతలకు మధ్య ఇంత గ్యాప్ ఉందా?

వైసీపీ అధినేత జగన్ కు పార్టీల నేతల మధ్య గ్యాప్ ఉన్నట్లు కనిపిస్తుంది.

Update: 2025-10-25 11:49 GMT

వైసీపీ అధినేత జగన్ కు పార్టీల నేతల మధ్య గ్యాప్ ఉన్నట్లు కనిపిస్తుంది. వారి మధ్య సరైన అవగాహన ఉన్నట్లు కనిపించడం లేదు. విశాఖ గూగుల్ డేటా సెంటర్ విషయంలో ఈ విషయం మరొకసారి స్పష్టమయింది. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన అవగాహన ఒప్పందాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుదుర్చుకున్నారు. కానీ విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఒప్పందం కుదుర్చుకున్న వెంటనే వైసీపీ ఉత్తరాంధ్ర నేతలు మండిపడ్డారు. డేటా సెంటర్ తో ఉపయోగాలు లేవని, పర్యావరణానికి ముప్పు అని వైసీపీ నేతలు ప్రకటించారు. అదే సమయంలో నీరు,విద్యుత్తు అధికంగా వినియోగమవుతుందని చెప్పుకొచ్చారు.

డేటా సెంటర్ వల్ల...
అయితే వైఎస్ జగన్ రెండు రోజుల క్రితం మీడియా సమావేశంలో గూగుల్ డేటా సెంటర్ వల్ల ఉపయోగాలను పూసగుచ్చినట్లు చెప్పారు. గూగుల్ డేటా సెంటర్ వల్ల భవిష్యత్ లో అనేక ఉపయోగాలున్నాయని, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, క్వాంటమ్ వ్యాలీకి ఈ డేటా సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందని జగన్ చెప్పారు. డేటా సెంటర్ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని చెప్పుకొచ్చారు. డేటా సెంటర్ వల్ల వచ్చే ఉపాధి అవకాశాలు తక్కువని అన్నారు. భవిష్యత్ లో జరిగే మార్పునకు డేటా సెంటర్ ముఖ్య భూమిక అని జగన్ అన్నారు. రిక్రియేషన్ సెంటర్, ఐటీ పార్క్, స్కిల్ సెంటర్ పెట్టాలని నాడు అదానీతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని జగన్ తెలిపారు. దీంతో వైసీపీ నేతలు డేటా సెంటర్ పై ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు గాలిలో తేలిపోయినట్లయింది.
ప్రభుత్వ ప్రకటన వెంటనే...
డేటా సెంటర్ ఏర్పాటు ప్రకటనను ప్రభుత్వం చేసిన వెంటనే హడావిడిగా వచ్చిన వైసీపీ నేతలు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టడమే పనిగా పెట్టుకున్నారు. అంతే తప్ప దాని వల్ల ఉపయోగాలను గురించి కనీసం ఆరా తీసే ప్రయత్నం చేయలేదు. గత ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన గుడివాడ అమర్నాధ్ సయితం విమర్శలకు దిగారు. బొత్స సత్యనారాయణ వంటి సీనియర్ నేతలు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. డేటా సెంటర్ ను అమరావతిలో పెట్టుకోవచ్చు కదా? అని కూడా ప్రశ్నించారు. జగన్ విదేశాల నుంచి వచ్చి వైసీపీ నేతల ఆరోపణలకు విలువ లేకుండా చేశారు. దీంతో వైసీపీ అధినేతకు, నేతలకు మధ్య గ్యాప్ ఉందన్న విషయం మరోసారి బయటపడింది.


Tags:    

Similar News